ఫ్రంట్ లో బాబుకు స్థానం లేదా?

March 21, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఎక్కడో దూరంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి మాట్లాడి వచ్చారు. త్వరలో ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఆయన తీరు చూస్తుంటే పొరుగునే ఉన్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తోంది. 

అదేవిధంగా కెసిఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఇప్పటికి పది రోజులైనపటికీ, చంద్రబాబు కానీ, తెదేపా నేతలు గానీ ఇంతవరకు స్పందించలేదు. దానిపై తమ వైఖరి తెలియజేయలేదు. బహుశః వారికీ దానిలో చేరే ఉద్దేశ్యం లేకపోవచ్చు లేదా వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. 

ఉత్తరాది నేతలు బాబు, కెసిఆర్ ల కంటే చాలా గడుసువారు. చాలా అవకాశవాదులు. వారితో సర్దుకుపోవడానికి కెసిఆర్ సిద్దపడుతున్నప్పుడు, బాబుతో సర్దుకుపోవడం పెద్ద కష్టం కాదనే చెప్పవచ్చు. ప్రస్తుతం తెదేపా కూడ భాజపాతో తెగతెంపులు చేసుకొని కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కనుక కెసిఆర్, చంద్రబాబుల ఉమ్మడి శత్రువు కూడా ఒక్కరే. పైగా బాబుకు జాతీయస్థాయి నేతలతో మంచి పరిచయాలున్నాయి. ఇక తెలంగాణాలో తెదేపాను కాపాడుకోవడానికి తెరాసతో పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్ని సానుకూల అంశాలున్నప్పటికీ కెసిఆర్, బాబు వంక కన్నెత్తి చూడటం లేదు. అందుకు బలమైన కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.         

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు రాజకీయంగా బద్దవిరోధులైన కెసిఆర్, చంద్రబాబు ఇద్దరూ ఫ్రంట్ లో ఇమడటం కష్టమే. అదీగాక బాబు పట్ల అయిష్టత, ఏహ్యత కారణంగానే కెసిఆర్ ఆయనను దూరంగా ఉంచుతున్నారనే అనుమానాలున్నాయి. ఇక మరో కారణం ఏమిటంటే, ఫ్రంట్ ఏర్పాటు అయితే మున్ముందు ఎలాగూ ఫ్రంట్ నేతల మద్య ఆధిపత్యపోరు తప్పదు. కానీ బాబును చేర్చుకొంటే అది ఇప్పుడే మొదలవవచ్చుననే భయం కూడా ఒక కారణం అయ్యుండవచ్చు. కెసిఆర్ తన ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా ముందుకు సాగాలనుకొనే వ్యక్తి. కనుక చంద్రబాబును చేర్చుకొని ఆయన సలహాలను స్వీకరించడం, అమలుచేయడం ఇష్టం లేకనే బాబును పలకరించకుండా వేరెవరితోనో మాట్లాడుతున్నారనుకోవచ్చు. అయితే ప్రస్తుతం వారిరువురూ బద్ధశత్రువులులా వ్యవహరిస్తున్నప్పటికీ, ఎన్నికలు దగ్గరపడినప్పుడు ఏమైనా జరుగవచ్చు.


Related Post