కాంగ్రెస్ లో ప్రక్షాళన షురూ!

March 21, 2018


img

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. డిల్లీలో జరిగిన ప్లీనరీ సమావేశాలలో రాహుల్ గాంధీ మాట్లడుతూ పార్టీలో వయసు పైబడిన వృద్ధనేతలు స్వచ్చందంగా తమ పదవులలో నుంచి తప్పుకొని యువతకు అవకాశం కల్పించాలని కోరారు. అయన సూచన మేరకు గుజరాత్, గోవా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రాజ్ బబ్బర్ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానానికి, కార్యకర్తలకు మద్య దూరాన్ని తగ్గించి పార్టీని యువతతో నింపి బలోపేతం చేయడానికే ఈ సూచన చేస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుల రాజీనామాలు మొదలయ్యాయి కనుక తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారా లేదా అనే సందేహం కలగడం సహజమే. అయితే వయసు పైబడినవారిని మాత్రమే పదవులలో నుంచి తప్పుకోవాలని కోరినందున అయన రాజీనామా చేయవలసిన అవసరం ఉండదు. పైగా అయన సారద్యంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా స్పష్టం చేశారు కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి డోకా లేదనే భావించవచ్చు.

అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచే ఈ మార్పు మొదలుపెట్టవలసిన అవసరం చాలా ఉంది. రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నవారిలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో సహా మాజీ కేంద్రమంత్రులు, ఇంకా అనేకమంది సీనియర్ నేతలలో అత్యధికులు వయసు పైబడినవారే. పార్టీ విధానాలు, వ్యూహాలు, ఆలోచనలలో కొత్తదనం రావాలంటే మొదట పైస్థాయి నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. రాష్ట్రాలలో పిసిసి అధ్యక్షులను మార్చినంత మాత్రాన్న పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాబోదు.


Related Post