ఏప్రిల్ నెలలో కోదండరాం పార్టీ ఆవిర్భావం

March 20, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఏర్పాటు చేయబోతున్న తెలంగాణా జన సమితి (టిజెఎస్) ఏప్రిల్ రెండవ వారంలో ప్రారంభం కావచ్చని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ పేరు, పార్టీ చిహ్నంకు ఆమోదం లభించగానే పార్టీ ఆవిర్భావసభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు వీలుగా టిజెఎసి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దాని కోసం 11 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జిల్లా స్థాయిలో సదస్సులు, సమావేశాలు నిర్వహించి, ఈసీ అనుమతి రాగానే పార్టీ ఆవిర్భావ సభ తేదీని ఖరారు చేయాలని టిజెఎసి నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వీటి కోసం ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ లో సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. తమ పార్టీని ప్రజలకు ఏవిధంగా చేరువ చేయాలి? అధికార తెరాసను ఏవిధంగా ఎదుర్కోవాలి? ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవడం, ఆవిర్భావ సభకు జనసమీకరణ వంటి పలు అంశాలపై వారు చర్చించారు. యువత, మహిళా విభాగం, ఐటి, లీగల్ సెల్, మీడియా, ప్రచార కమిటీ మొదలైన అనుబంధ విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. కనుక ఈసీ నుంచి అనుమతి రావడమే ఆలస్యం.

కాంగ్రెస్ నేతలతో భుజాలు రాసుకొంటూ తిరిగే కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కొత్త పార్టీ పెట్టడానికి సిద్దం అవుతున్నారు కనుక తనకు కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి రహస్య అవగాహన లేదని నిరూపించుకోవలసి ఉంటుంది. లేదా నేరుగా కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నట్లయితే ఇక ఎవరూ ఆయనను వేలెత్తి చూపలేరు. 

జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్దం అవుతుంటే, రాష్ట్రంలో తెరాసకు కొత్త రాజకీయ ప్రత్యర్ధులు పుట్టుకొస్తున్నారు. కనుక 2019 ఎన్నికలు తెరాస ఊహించినంత తేలికగా ఉండకపోవచ్చు. 


Related Post