వారికి మార్కులేసే స్థాయి ఆయనకుందా?

March 19, 2018


img

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రుల పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నకు సమాధానంగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు 10కి 6 మార్కులు, ఏపి సిఎం చంద్రబాబుకు 2.5 మార్కులు వేస్తానని చెప్పారు. తాను చాలా బాధ్యతగా మాట్లాడుతుంటానని చెప్పుకొనే పవన్ కళ్యాణ్, ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులను ఉద్దేశ్యించి    ఈవిధంగా మాట్లాడి తన రాజకీయ అపరిపక్వతను మరోమారు బయటపెట్టుకొన్నారని చెప్పకతప్పదు. 

ఇదివరకు కొంతమంది సీనియర్ నేతల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వారి గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొన్నారు. అది నిజమే కనుక ఆ మాటలను అయన హుందాతనంగా ప్రజలు స్వీకరించారు. బొత్తిగా రాజకీయ అనుభవం లేనందున గమ్యం లేకుండా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉద్దండులైన ముఖ్యమంత్రులకు మార్కులు వేసి తన అపరిపక్వతను బయటపెట్టుకొన్నారు. 

నిన్నటి వరకు ఏపికి ప్రత్యేకహోదా కావాలని, దాని కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేయడానికి కూడా వెనుకాడనని చెప్పుకొన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంటర్వ్యూలో ఏపికి ప్రత్యేకహోదా అవసరం లేదని, సరిపడినన్ని నిధులు ఇస్తే చాలునని నోరు జారడంతో, అయన రాజకీయ ప్రత్యర్ధులకు అడ్డంగా దొరికిపోయారు. వారి విమర్శలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. 

జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతాలను ప్రజలకు పరిచయం చేసేందుకు, రాష్ట్ర సమస్యలు, రాజకీయ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన మంచి వక్తలను, కంటెంట్ రైటర్స్ ను ఇంటర్వ్యూలు చేసి మరీ పార్టీలోకి తీసుకొంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్  నోట ఇటువంటి అపరిపక్వ మాటలు విన్నప్పుడు అయన వారి సలహాలు, సూచనలు ఏవీ తీసుకోవడం లేదనిపిస్తుంది. కనుక ఇకనైనా అయన మీడియాతో మాట్లాడే ముందు తన సలహాదారులను సంప్రదించి మాట్లాడితే మంచిది లేకుంటే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంటుంది.


Related Post