తెరాస అందుకే అలా వ్యవహరిస్తోందా?

March 19, 2018


img

ఊహించినట్లుగానే ఈరోజు కూడా తెరాస, ఏఐఏడిఎంకే ఎంపిల ఆందోళనల కారణంగా మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తెదేపా, వైకాపాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై ఎటువంటి చర్చ లేకుండానే లోక్ సభ రేపటికి వాయిదా పడింది. దీనిపై తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పందిస్తూ, “మా తీర్మానానికి మద్దతు ఇస్తామని చెపుతూనే అది చర్చకు రాకుండా తెరాస ఎందుకు అడ్డుపడుతోందో మాకు అర్ధం కావడంలేదు. రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన అంశం. దానిని కేంద్రంతో ముడిపెట్టి తెరాస సభ్యులు లోక్ సభలో రాద్దాంతం చేయడం చాలా విచిత్రంగా ఉంది. అసలు వారు ఏ ఉద్దేశ్యంతో ఆవిధంగా చేస్తున్నారో మాకు అర్ధం కావడం లేదు,” అన్నారు.

తెదేపా, వైకాపా నేతలు తమపై విమర్శలకు తెరాస ఎంపి వినోద్ జవాబిస్తూ, “మేము అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం లేదు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి, సభలో మా ఆందోళనలకు ఎటువంటి సంబంధమూ లేదు. రెండుమూడు బిల్లులపై సభలో ఎటువంటి చర్చ జరుపకుండానే లోక్ సభ ఆమోదించింది. స్పీకర్ తలుచుకొంటే తెదేపా ప్రవేశపెట్టదలచుకొన్న అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఆవిధంగానే ప్రవేశపెట్టవచ్చు. దానిని ప్రవేశపెట్టడానికి మేము అడ్డుకాదు. దానికి 52మంది సభ్యుల సంతకాలు ఉంటే సరిపోతుంది. ఒకవేళ అది చర్చకు వస్తే మేము తప్పకుండా దానికి మద్దతు ఇస్తాము. తెదేపాతో మాకు పోటీయే లేదు కనుక ఒకవేళ ఏపికి, దాని ప్రజలకు పాలనాపరమైన సమస్యలుంటే మావంతు సహకారం అందిస్తాము,” అని అన్నారు.

వినోద్ చెప్పినట్లుగా స్పీకర్ తలుచుకొంటే సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కష్టమేమీ కాదు కానీ మోడీ సర్కార్ చేజేతులా కొరివితో తల గోక్కోదు కనుక సభ ఆర్డర్ లో లేదనే వంకతో చర్చకు అనుమతించకుండా తప్పించుకొంటోంది. ఇక తెరాస విషయానికి వస్తే, ఇదివరకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పినప్పుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని చిన్నపిల్లల చేష్టగా అభివర్ణించారు. పదిమంది కూడా లేని వైకాపా మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకోవడమే అందుకు కారణం. కానీ ఇప్పుడు తెదేపా కూడా అవిశ్వాసం అంటోంది. అయితే మోడీతో కెసిఆర్ కుమక్కు అయినందునే ‘కర్ర విరగకుండా పాము చావకుండా...’ అన్నట్లుగా అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని చెపుతూనే తెరాస ఎంపిల చేత ఈవిధంగా అడ్డుకొంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 


Related Post