ఒక్కోసారి చాలా మంచి ఉద్దేశ్యంతో చేసిన పనులు కూడా ఏవో కారణాల చేత బెడిసికొడుతుంటాయి. రాష్ట్రంలో చేనేత కార్మికులకు, మరమగ్గాల యూనిట్లకు ఏడాది పొడవునా ఉపాధి, ఆదాయం కల్పిస్తూ మరోపక్క రాష్ట్రంలో నిరుపేద మహిళలందరికీ బతుకమ్మ పండుగ రోజున చీరలు పెట్టాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ప్రణాళికా సమన్వయ లోపాల కారణంగా అంత గొప్ప పధకం విఫలమైంది. ఆ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలైంది.
గత ఏడాది ఎదురైనా చేదు అనుభవాలను, లోపాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకొని బతుకమ్మ చీరల తయారీ, పంపిణీకి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి కూడా కోటి చీరలు తయారుచేయించి పంచాలని నిర్ణయించింది. అయితే ఈసారి సిరిసిల్లాలో గల 25,000 మరమగ్గాలపైనే వీటిని నేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి బతుకమ్మ చీరల నేత పనులు మొదలుపెడితే సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి అక్టోబర్ రెండవవారంలోగా మహిళలకు అందించవచ్చని అధికారులు అంచనా వేశారు.
గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి చీరల నేయించడం, నాణ్యత విషయంలో కూడా అధికారులు పూర్తి శ్రద్ధ పెడుతున్నారు. మొదటి నుంచి చివరిదశ వరకు పూర్తి పారదర్శకత పాటించాలని నిర్ణయించారు. ఈసారి అన్ని చీరలకు పట్టు అంచు ఉండే విధంగా తయారు చేయించాలని నిర్ణయించారు కనుక ఈసారి చీరలు అందుకోబోతున్న మహిళలు చాలా సంతోషిస్తారని కనుక ఈసారి ఈ పధకం తప్పకుండా విజయవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే కనుక జరిగితే ఈ ఎన్నికల సంవత్సరంలో తెరాసకు రాష్ట్రంలో మహిళల ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. ఈ సంగతి అధికారులు, ముఖ్యంగా తెరాస నేతలు గుర్తుంచుకొని ఎక్కడా ఎటువంటి లోపాలు జరుగకుండా ఈ పధకాన్ని విజయవంతం చేస్తే వారికే మంచిది.