లోక్ సభలో నేడూ మళ్ళీ అదే నాటకం?

March 19, 2018


img

లోక్ సభలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నకారణంగా మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తెదేపా, వైకాపాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ పక్కనపెట్టడంతో, ఆ రెండు పార్టీలు తమ ఎంపిల ద్వారా మళ్ళీ లోక్ సభ సెక్రెటరీ జనరల్ స్నేహలతా శ్రీవత్సవకు శుక్రవారం నోటీసులు ఇచ్చాయి. కానీ ఇవ్వాళ్ళ కూడా వాటిపై లోక్ సభలో చర్చ జరుగుతుందో లేదో అనుమానమే. 

ఆ రెండు పార్టీలు రాజకీయ లబ్దిపొందాలనే ఉద్దేశ్యంతోనే ప్రత్యేకహోదా అంశంతో ఏపి ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నాయని అందరికీ తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలనే చిత్తశుద్ధి లేకపోయినా కనీసం మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవి ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానాలలోను వాటికి చిత్తశుద్ధి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రత్యేకహోదా కోసం తామే కేంద్రంతో గట్టిగా పోరాడుతున్నామని చాటిచెప్పుకొని ప్రజలను ఆకట్టుకోవడానికే వైకాపా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంటే, ఈ రేసులో తాము ఎక్కడ వెనుకబడిపోతామనే భయంతోనే తెదేపా ప్రవేశపెడుతోంది. రెండూ ఒకే కారణం, ఒకే లక్ష్యం, ఒకే శత్రువుతో పోరాడుతున్నప్పుడు కలిసే పోరాడవచ్చు కానీ వేర్వేరుగా పోరాడుతున్నాయి. వాటి పోరాటంలో చిత్తశుద్ధి లేదని చెప్పడానికి అదే నిదర్శనం. 

ఇక వాటికి మద్దతు ఇస్తామని చెపుతున్న తెరాస అవి చర్చకు రాకుండా సభలో గందరగోళం సృష్టిస్తుండటం మరో విచిత్రం. పట్టుమని పది మంది కూడా లేని తెరాస ఎంపిలు సభలో గందరగోళం సృష్టిస్తున్నారనే సాకుతో అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ పక్కనబెట్టడం మరీ విచిత్రం. అంటే వాటిని ప్రవేశపెడుతున్న రెండు పార్టీలకు, వాటికి మద్దతు ఇస్తున్న పార్టీలకు, వాటిని ఎదుర్కొంటున్న మోడీ సర్కార్...వేటికీ ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోంది. కనుక నేడు కూడా మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతం కావచ్చు.      



Related Post