అయితే కెసిఆర్ ఏమి చేస్తారో?

March 16, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ ముహూర్తాన్న ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన చేశారో కానీ ఆరోజు నుంచి దేశంలో ఊహించని రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అయన ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దం అవుతున్నారు. 

ఇటీవల జరిగిన యూపి, బిహార్ ఉపఎన్నికలలో భాజపాకు ఎదురుదెబ్బ తగలడంతో సోనియాగాంధీ భాజపా వ్యతిరేక పార్టీల నేతలతో వరుస సమావేశాలు అవుతున్నారు. ఇప్పటికే ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ ఆమెతో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన మమతా బెనర్జీ డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. ఇంకా యూపి, బిహార్, జమ్ము కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలతో సోనియా లేదా రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీలను అన్నిటినీ కూడగట్టుకొని మహా కూటమిని ఏర్పాటు చేసుకొని 2019 ఎన్నికలలో ఎన్డీయే కూటమిని ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. 

కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా అన్ని పార్టీలను కూడగట్టి ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కెసిఆర్ అనుకొంటే, అయన కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ధర్డ్ ఫ్రంట్ లో ఎన్ని పార్టీలు చేరుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుకు పూనుకొంటే, దానికీ ఇదే పరిస్థితి ఎదురవవచ్చు. మమతా బెనర్జీవంటి నిలకడ లేని రాజకీయ నేతలను నమ్ముకోవడం ఎంత ప్రమాదమో ముందుగానే తెలియడం కూడా మంచిదే అయ్యింది. కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కెసిఆర్ కాస్త ఆచితూచి అడుగులు వేయడమే మంచిది. 


Related Post