లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్న మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమంటే తమ అసమ్మతి తెలపడానికి లేదా తమ రాజకీయ లబ్ది కోసం చేస్తున్నదిగానే భావించాలి. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేశారంటూ ఇవ్వాళ్ళ వైకాపా ఎంపిలు మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. దానికి తెదేపా కూడా మద్దతు ఇవ్వాలని, ఇస్తుందని జగన్ భావిస్తూ వచ్చారు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉందని సాక్షాత్ ఏపి సిఎం చంద్రబాబు కూడా దృవీకరించినట్లవుతుందాని భావించారు. జగన్ కోరుకొన్నట్లుగానే, తెదేపా కూడా వైకాపా ఈరోజు లోక్ సభలో ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఈయడానికి అంగీకరించిందని మీడియాకు లీకులు అందడంతో, అదే విషయం జగన్ మనసాక్షి పత్రికలో ‘దిగివచ్చిన బాబు’ అంటూ గొప్పగా ఒక వార్త వేసేసుకొంది.
కానీ బాబును జగన్ చాలా తక్కువగా అంచనా వేశారని నిరూపిస్తూ, ఆఖరు నిమిషంలో ఆయన వైకాపాకు ఊహించని పెద్ద షాక్ ఇచ్చారు. వైకాపా ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానం స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే కనుక దానికి తెదేపా మద్దతు ఇవ్వరాదని, తెదేపా స్వయంగా మరొక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు తమ ఎంపి తోట నర్సింహంకు కొద్ది సేపటి క్రితమే ఒక సందేశం పంపించారు. దానికి శివసేన, ఏ.ఐ.ఏ.డి.ఎం.కె. వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి అంగీకరించినట్లు ‘తెదేపా సానుకూల మీడియా’లో లీకులు వచ్చేసాయి. అన్ని పార్టీలు కలుపుకొని సుమారు 100 మందికి పైగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఈయవచ్చని దాని సారాంశం. కనుక ఎవరి అవిశ్వాస తీర్మానం వారిదే ఎవరి రాజకీయ లెక్కలు...ప్రయోజనాలు వారివేనని స్పష్టం అవుతోంది.
ఏపిలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు తమ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ పార్టీల రాజకీయప్రయోజనాలే ముఖ్యం అని భావిస్తుంటాయని కేంద్రం కూడా గ్రహించినందునే, అది ఆంధ్రప్రదేశ్ పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించగలుగుతోంది. ఈ సంగతి తెదేపా, వైకాపాలకు కూడా తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తూ ఇంకా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఉన్న అధికారం నిలుపుకోవాలని తెదేపా, అధికారం దక్కించుకోవాలని వైకాపా కుటిల రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఆ రెండు పార్టీలను తప్పు పట్టారు.