తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని స్వయంగా ప్రకటించి జాతీయ పార్టీలతో సహా దేశంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారు కొందరు ఆయన ప్రతిపాదనకు మద్దతు పలికినట్లు వార్తలు వచ్చాయి.
కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఆయనకు మద్దతు పలుకవచ్చని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి తప్ప ఇంతవరకు అయన కానీ తెదేపా నేతలు గానీ స్పందించనే లేదు. ప్రతీ అంశంపై వెంటనే స్పందించే టిటిడిపి నేతలు కూడా కెసిఆర్ ప్రతిపాదనపై స్పందించకపోవడం గమనిస్తే, దానిపై తెదేపాలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని భావించవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకోవడంపైనే టిటిడిపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పుడు, కెసిఆర్ ఏర్పాటుచేయబోతున్న ధర్డ్ ఫ్రంట్ కు తెదేపా గుడ్డిగా మద్దతు ఇస్తుందనుకోవడం అవివేకమే అవుతుంది. కనుక ధర్డ్ ఫ్రంట్ లో తెదేపా భాగస్వామి అవుతుందా లేక దూరంగా ఉంటుందా లేక వ్యతిరేకిస్తుందా? అనే దానిపై స్పష్టత రావలసి ఉంది. అయితే తెదేపాకు అనుకూల మీడియాగా భావింపబడుతున్న ఆంద్రజ్యోతిలో శుక్రవారం సంచికలో ‘చంద్రబాబు సారథ్యంలో ఫెడరల్ ఫ్రంట్?’ అనే శీర్షికన ఒక ఆసక్తికరమైన వార్త ప్రచురితమైంది.
దానిలో చంద్రబాబు ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, గతంలో అయన జాతీయస్థాయిలో అటువంటి ఫ్రంట్ కు సారధ్యం వహించి దానిని విజయవంతంగా నడిపినందున అనేక ఉత్తరాది పార్టీలు అయనతో చేతులు కలపడానికి సంసిద్దత వ్యక్తం చేశాయని, మే నెలలో దీనిపై ఆయన అధికారికంగా ప్రకటన చేయబోతున్నారని ‘రిపబ్లిక్ టీవి’ లో గురువారం ఒక వార్త ప్రసారం అయ్యిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఈవార్తలలో నిజానిజాలు ఏమిటో త్వరలోనే తెలుస్తుంది. ఒకవేళ అవి నిజమయితే కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ కు అది పోటీగా తయారవుతుంది. కానీ ప్రస్తుతం స్వంత ఇంటిని చక్కబెట్టుకోలేక తీవ్ర విమర్శల పాలవుతున్న చంద్రబాబు జాతీయ రాజకీయాలలోకి వెళతారంటే నమ్మశక్యంగా లేదు.
తెలంగాణా అన్నివిధాలుగా అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప ప్రతిపక్షాలన్నీ బలహీనపడి ఉన్నాయి. కనుక రాష్ట్రంలో తెరాసకు అనుకూలమైన రాజకీయ వాతావరణం ఉంది. ఇక కెసిఆర్ కుమారుడు కేటిఆర్ అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీపైన పూర్తి పట్టు సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అన్నివిధాల అర్హుడు, సమర్ధుడు అని నిరూపించుకొన్నారు. కనుక కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళినా తెరాసకు ఎటువంటి సమస్య ఉండబోదు.
కానీ ఏపిలో ఇప్పుడు తెదేపాకు ఎదురుగాలి వీస్తోంది. నారా లోకేష్ ను దొడ్డిదారిన తీసుకువచ్చి మంత్రిపదవి కట్టబెట్టినప్పటికీ నేటికీ అయన తన సమర్ధతను, నాయకత్వ లక్షణాలను చాటుకోలేకపోతున్నారు. అదే సమయంలో ఒకపక్క పవన్ కళ్యాణ్, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ తెదేపాకు గట్టి సవాలు విసురుతున్నారు. ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న భాజపా కూడా శత్రువైపోయింది. ఈ పరిస్థితులలో చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే ఏపిలో కూడా తెదేపా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. కనుక కెసిఆర్ ఏర్పాటు చేయబోతున్న ధర్డ్ ఫ్రంట్ కే మద్దతు పలుకవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో తెదేపాకు అదే మంచిది.