తెరాసకు అదే సూత్రం వర్తించదా?

March 15, 2018


img

యూపి, బిహార్ రాష్ట్రాలలో మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు ఘోరపరాజయం పొందడంపై రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “యూపి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఖాళీ చేసిన స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భాజపాకు పట్టం కట్టి డిల్లీ పీఠంపై కూర్చోబెట్టిన రాష్ట్రమే (యూపి) ఏదీ శాశ్వితం కాదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మరొకచోట మరో జాతీయపార్టీ ధరావతు కోల్పోయింది,” అని ట్వీట్ చేశారు. 

2014 సార్వత్రిక ఎన్నికలలో, ఆ తరువాత మళ్ళీ ఏడాది క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో యూపి ప్రజలు భాజపాను తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. కానీ యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా రాష్ట్రంలో భాజపా సర్కార్ పట్ల వ్యతిరేకత మెల్లగా పెరుగసాగింది. భాజపా రాజకీయ ప్రత్యర్ధులు చేతులు కలిపి భాజపాను చిత్తుచిత్తుగా ఓడించారు.         

తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ వైఖరి పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కానీ కెసిఆర్ వాటిని లెక్కచేయకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీయే 106 సీట్లు గెలుచుకొంటుందని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యుల శాసనసభ్యత్వం రద్దు చేయడం, మిగిలిన కాంగ్రెస్ సభ్యులందరినీ సస్పెండ్ చేయడంతో కెసిఆర్ నియంతృత్వ పోకడల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా కాంగ్రెస్ పట్ల ప్రజలలో సానుభూతి పెరుగవచ్చు. 

అక్కడ యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేసినట్లే ఇక్కడ కెసిఆర్ వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉపఎన్నికలు జరిగినట్లే ఇక్కడా త్వరలోనే జరుగబోతున్నాయి. అక్కడ ప్రతిపక్షాలు చేతులు కలిపినట్లే ఇక్కడా కలుపుతున్నాయి. కనుక యూపిలో జరిగినట్లే తెలంగాణాలో కూడా తెరాసకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్, భాజపాలను నెత్తిన పెట్టుకొని మోసిన ప్రజలే హటాత్తుగా వాటిని చిత్తుచిత్తుగా ఓడించినప్పుడు, తెరాసతో కూడా ఆవిధంగా వ్యవహరించనే నమ్మకం ఏమిటి? కనుక తెరాస ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్తపడటం మంచిదేమో?



Related Post