కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. తమను ఎటువంటి వివరణ కోరకుండా, స్పీకర్ మధుసూధనాచారి తమ శాసనసభ్యత్వాలను ఏకపక్షంగా రద్దు చేయడం రాజ్యాంగవిరుద్దమని కనుక తమకు న్యాయం చేయలని వారు తమ పిటిషన్ లో కోరారు. వారి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు శుక్రవారం దానిపై విచారణ జరిపే అవకాశం ఉంది.
ఇక సీనియర్ కాంగ్రెస్ నేతలు డిల్లీ కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి స్పీకర్ పై పిర్యాదు చేశారు. ఏకపక్షంగా, రాజ్యాంగవిరుద్దంగా తీసుకొన్న ఈ నిర్ణయాన్ని హైకోర్టు తీర్పు వెలువడేవరకు అమలుచేయవద్దని కోరారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దు చేసిన తరువాత, ఆ రెండు స్థానాలకు కర్ణాటక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరుగుతాయని తెరాస నేతలు చెప్పడం గమనిస్తే తెరాస సర్కార్ కేవలం రాజకీయ దురుదేశ్యంతోనే తమ సభ్యుల శాసనసభ్యత్వాలను రద్దు చేసినట్లు అర్ధమవుతోందని కాంగ్రెస్ నేతలన్నారు.
సాధారణంగా ఇటువంటి కటిన నిర్ణయాలు తీసుకొనే ముందు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యులకు సంజాయిషీ చెప్పుకొనేందుకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటువంటి కేసులను శాసనసభా వ్యవహారాల కమిటీకి అప్పగించి, అది విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చిన తరువాత దాని ఆధారంగా సభ్యులపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కానీ కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, సభ్యత్వరద్దు విషయంలో ఆవిధంగా చేయలేదు. కనుక హైకోర్టు వారిరువురి సభ్యత్వరద్దుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ఆశ్చర్యం లేదు. గతంలో వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏపి సర్కార్ ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేసినప్పుడు హైకోర్టు ఆ నిర్ణయాన్ని తప్పు పట్టింది. అప్పుడు శాసనసభా వ్యవహారాల కమిటీకి ఆ కేసును అప్పగించి ఆమెపై విధించిన సస్పెన్షన్ ఖరారు చేసింది. కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలోనూ అలాగే జరుగవచ్చు. త్వరలోనే దీనిపై స్పష్టత రావచ్చు.