మోడీ సర్కార్ పై అవిశ్వాసం!

March 15, 2018


img

మోడీ సర్కార్ పై రేపు అంటే శుక్రవారమే అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దాని కోసం ఆ పార్టీ ఎంపి వివి సుబ్బారెడ్డి ఈరోజు లోక్ సభ సెక్రెటరీ జనరల్ ను కలిసి నోటీస్ అందజేశారు. భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొంది కనుక తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వైకాపా కోరుతోంది. తెదేపాకు కూడా అందుకు అభ్యంతరం లేనప్పటికీ, ఆవిధంగా చేస్తే ఇంతకాలంగా జగన్ చేస్తున్న వాదన సరైనదేనని అంగీకరించినట్లవుతుంది. పైగా ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో పోరాడిన క్రెడిట్ జగన్ కే దక్కుతుంది తప్ప తెదేపాకు దక్కదు. కనుక దీనిపై రాజకీయ కూడికలు, తీసివేతల లెక్కలు సరిచూసుకొన్నాక తెదేపా తగిన నిర్ణయం తీసుకోవచ్చు.

ఇక మోడీ సర్కార్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్.జె.డి.,సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, శివసేన, బిజెడి, డిఎంకె తదితర పార్టీలతో పాటు తెరాస మద్దతు వైకాపా కోరుతోంది. తెరాస అధినేత కెసిఆర్ కూడా మోడీ సర్కార్ పై తిరుగుబాటు చేస్తున్నారు కనుక అవిశ్వాస తీర్మానానికి తెరాస మద్దతు ఇచ్చినా ఇవ్వవచ్చు. కానీ మోడీ సర్కార్ కు లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్నందున వైకాపా ప్రవేశపెట్టబోయే ఈ అవిశ్వాస తీర్మానం వలన ఎటువంటి నష్టమూ ఉండదు. వైకాపాతో సహా ఆయా పార్టీల రాజకీయ లబ్ది కోసం లేదా భాజపాతో ఉన్న శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెడుతున్నదే తప్ప దీని వలన మోడీ సర్కార్ కు వచ్చే నష్టముండదు..ఏపికి లాభమూ జరుగదు. 


Related Post