ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అన్ని రాష్ట్రాలలో కొత్త పార్టీలు, కూటములు పుట్టుకువస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే నటుడు కమల్ హాసన్ తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవ్వాళ్ళ మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అధికార అన్నాడిఎంకె పార్టీ బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం’ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఈరోజు మధురైలో ప్రకటించారు. పార్టీ జెండాలో జయలలిత చిత్రాన్ని ముద్రించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ రాష్ట్ర ప్రజలను, అన్నాడిఎంకె పార్టీని మోసం చేశారని, అందుకే వారిరువురికి ఆర్.కె. నగర్ నియోజకవర్గ ప్రజలు ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికలలో వారిరువురినీ గద్దె దింపి అమ్మ (జయలలిత) ఆశయాలను అమలుచేస్తామని దినకరన్ చెప్పారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, అటు అధికార అన్నాడిఎంకె పార్టీ నేతలు, ఇటు దినకరన్ కూడా అమ్మ ఆశయాల కోసమే పాటుపడుతున్నామని చెప్పుకొంటున్నారు. కానీ ఆమ్మ పేరు చెప్పుకొని అధికారం నిలబెట్టుకోవడం, దక్కించుకోవడమే వారి ఆశయమని అర్ధమవుతూనే ఉంది. ఆ రెండు గ్రూపులు తమిళ ప్రజలను మోసం చేస్తున్నాయని వాదిస్తూ కమల్ హాసన్ కూడా కొత్త పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. త్వరలో రజనీకాంత్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న ఈ పార్టీలన్నీ ఎన్నికల తరువాత కనబడవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె వాదిస్తోంది. వచ్చే ఎన్నికలలో ఈ పాత, కొత్త పార్టీలు, సినీ నటులు అందరి మద్య ప్రజల ఓట్లు చీలిపోయినట్లయితే తమిళనాడులో మరింత రాజకీయ అనిశ్చితి ఏర్పడటం ఖాయం.