కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ సస్పెండ్ చేసి, ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దు చేసిన వెంటనే టి-కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించి, తెరాస సర్కార్ నిర్ణయానికి నిరసనగా అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలనుకొంటున్నట్లు ప్రకటించారు. రాజీనామాలు చేయడానికి అనుమతి కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి సందేశం పంపామని, అనుమతి రాగానే అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేసేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం చెప్పారు. అయితే రెండు రోజులు గడిచిపోయినా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో టి-కాంగ్రెస్ నేతలు తెరాసకు, మీడియాకు జవాబు చెప్పుకోలేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారిప్పుడు. వారి ప్రకటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ, “మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు కదా? ఇంకా ఎందుకు చేయడం లేదు? అయినా మీరు తుమ్మాలన్నా...దగ్గాలన్నా...అందుకు డిల్లీ పెద్దల అనుమతి తీసుకోవలసిందే కదా?” అని శాసనసభలో ఎద్దేవా చేశారు.
బడ్జెట్ సమావేశాల మొదటిరోజు నుంచే తెరాస సర్కార్ ను గట్టిగా డ్డీకొనాలని అత్యుత్సాహం ప్రదర్శించడం మొదటి తప్పు. కెసిఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తుమ్మడానికి, దగ్గడానికి కూడా అధిష్టానం అనుమతి అవసరమని తెలిసి ఉన్నప్పుడు, ముందుగా అధిష్టానాన్ని సంప్రదించకుండా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించడం రెండవ తప్పు అని నిరూపితమైంది. ఈరోజైన కాంగ్రెస్ అధిష్టానం అందుకు అనుమతిస్తే టి-కాంగ్రెస్ పరువు నిలబడుతుంది లేకుంటే వారి మాటకు అధిష్టానం వద్ద ఏమాత్రం గౌరవం లేదని స్పష్టం అవుతుంది. ఇక వారు రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగలేరు. ఒకవేళ వారు మూకుమ్మడి రాజీనామాలు చేయకపోతే ఇక ఇప్పటి నుంచి తెరాస నేతలు అవకాశం దొరికినపుడల్లా వారి రాజీనామాల గురించి నిలదీయకమానరు. టి-కాంగ్రెస్ నేతల ఈ రెండు వ్యూహాలు బెడిసికొట్టాయి కనుక దీనిపై పార్టీలో నేతల మద్య పరస్పర ఆరోపణలు, కీచులాటలు జరిగినా ఆశ్చర్యం లేదు. టి-కాంగ్రెస్ నేతలు ఒకటనుకొంటే జరుగుతున్నది మరొకటి!