నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయబడిన కారణంగా ఉపఎన్నికలు అనివార్యంగా మారాయి. కనుక ఉపఎన్నికలలో వారిరువురిపై తెరాస నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా వెంకటరెడ్డిపై ఎవరు పోటీ చేస్తారని చర్చ మొదలైంది. గత ఎన్నికలలో తెదేపా తరపున ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన భూపాల్ రెడ్డి తరువాత తెరాసలో చేరారు. ఆ ఎన్నికలలో అయన వెంకటరెడ్డికి చాలా గట్టిపోటీ ఇచ్చారు కనుక మళ్ళీ ఈసారి కూడా ఆయననే వెంకటరెడ్డిపై పోటీకి దింపాలని తెరాస అధినేత కెసిఆర్ భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయన కూడా అందుకు సై అంటున్నారని సమాచారం. అయితే వచ్చే ఎన్నికలలో నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని కొన్ని రోజుల క్రితమే వెంకటరెడ్డి స్వయంగా ప్రకటించారు. కనుక ఈ ఉపఎన్నికలలో అయన పోటీ చేస్తారా లేక వేరేవరినైన నిలబెట్టి గెలిపించుకొని తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తారా? అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక సంపత్ కుమార్ పై పోటీ చేసేందుకు తెరాసలో చాలా మంది నేతలు సిద్దంగా ఉన్నందున వారిలో బలమైన అభ్యర్ధిని ఎంపిక చేయవలసి ఉంది.