కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు చేయడంతో అనూహ్యంగా ఉపఎన్నికలు వచ్చేసాయి. నల్గొండ, ఆలంపూర్ నియోజకవర్గాలకు జరుగబోయే ఉపఎన్నికలు కాంగ్రెస్, తెరాస రెంటికీ చాలా ప్రతిష్టాత్మకంగానే ఉంటాయి. ఎందుకంటే, రాష్ట్రంలో నిశబ్ద విప్లవం వ్యాపిస్తోందని వచ్చే ఎన్నికలలో ప్రజలు తెరాసను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారని కాంగ్రెస్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి కెసిఆర్ కు దమ్ముంటే నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి తనపై గెలవాలని సవాలు విసిరారు. తను ఉన్నంతవరకు జిల్లాలో తెరాస ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని నమ్మకంగా చెపుతున్నారు. కనుక వారి వాదనలు నిజమని నిరూపించుకోవాల్సి ఉంటుంది లేకుంటే కాంగ్రెస్ పరువు గంగలో కలుస్తుంది.
ఇక తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి హర్షిస్తున్న రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని కనుక వచ్చే ఎన్నికలలో కనీసం 106 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస నేతలు అందరూ బల్లగుద్ది వాదిస్తున్నారు. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతే ప్రజలు తెరాస వైపే ఉన్నారని స్పష్టం అవుతుంది. అదే..తెరాస ఓడిపోతే, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉందనే కాంగ్రెస్ నేతల వాదన నిజమవుతుంది. ఆ ప్రభావం తెరాస నేతలు, కార్యకర్తలపై...వచ్చే ఎన్నికలపై కూడా పడవచ్చు. కనుక ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవడానికి తెరాస చాలా గట్టి ప్రయత్నాలు చేయవచ్చు.
ఒకవేళ కాంగ్రెస్ 11 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతించినట్లయితే, ఇక దాదాపు పూర్తిస్థాయి ఎన్నికల జరుగుతున్నట్లే అవుతుంది. కనుక అప్పుడు రెండు పార్టీలకు ఉపఎన్నికలు అగ్నిపరీక్షగా మారడం ఖాయం.