కాంగ్రెస్, భాజపా నేతల విమర్శలు, ఆరోపణలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు ఒక విచిత్రమైన మాట అన్నారు. “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగేళ్ళలో తెరాస సర్కార్ ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణాను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందని ప్రతిపక్షాలు అర్ధంపర్ధం లేని మాటలు చెపుతున్నాయి. రాష్ట్రాలు ఎంత కావాలనుకొంటే అంత ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడానికి వీలులేదనే సంగతి మమ్మల్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేతలకు తెలుసు. తెలియకపోతే ఆ వివరాలు శాసనసభలోనే కుండబద్దలు కొట్టినట్లు చెపుతున్నాను. అందరూ తెలుసుకోండి.
రాష్ట్రం ఏర్పడినప్పుడు మనవాటగా వచ్చిన అప్పులు రూ.70,000 కోట్లు. దానితో కలుపుకొని ఈ నాలుగేళ్ళలో అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.1.40 లక్షల కోట్లున్నాయి. అంటే నాలుగేళ్ళలో మా ప్రభుత్వం చేసిన అప్పు రూ.70,000 మాత్రమే. ఇది నా స్వంత కవిత్వం కాదు. ఈ అప్పుల లెక్కలన్నీ కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. వాటి వెబ్ సైట్లలో ఆ వివరాలన్నీ ఎవరైనా చూడవచ్చు.
ఇక చేసిన అప్పులు మనం తీరిస్తేనే తీరుతాయనుకోవడం కూడా ఆవివేకమే. కేంద్రం నుంచి ప్రతీనెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఆ అప్పులకు ఎంతెంత చెల్లించాల్సి ఉంటుందో దానిని కత్తిరించుకొన్నాకనే మిగిలిన డబ్బు పంపబడుతుంది. కనుక మేము చేసిన అప్పులే కాదు గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కూడా ఎప్పటికప్పుడు మన ఆదాయంలో నుంచి కేంద్రమే కోసుకొంటుంది.
ఇక ప్రతీనెలా కేంద్రం నుంచి మనకు అందే మొత్తం సుమారు రూ.10,500 కోట్లు ఉంటుంది. దానిలోనే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు, నెలవారీ ఖర్చులు అన్నీ సర్దుకోవలసి ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాలు తీర్చేస్తానని చెపుతోంది?అది ఏవిధంగా సాధ్యం? ఆవిధంగా ఒకేసారి పంటరుణాలను మాఫీ చేయాలంటే ఒక ఆరునెలల పాటు రాష్ట్రంలో అన్ని ఖర్చులు, పనులు నిలిపివేయాలి. అది సాధ్యమేనా?
మాపై విమర్శలు చేస్తున్న కిషన్ రెడ్డి వంటి యువనేతలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇవన్ని వారి వాదనలు ఖండించడానికి చెపుతున్నవి కావు. ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇటువంటి నిర్మాణాత్మకమైన వివరాలు తెలుసుకొంటే ఉజ్వల భవిష్యత్ ఉన్న అయన వంటి యువనేతలకు చాలా ఉపయోగపడుతుందని చెపుతున్నాను. కిషన్ రెడ్డి మంచి తెలివైనవారు. అయన కూడా మున్ముందు పెద్దపెద్ద పదవులు చేపట్టాలి...కుదిరితే ముఖ్యమంత్రి కూడా కావాలని కోరుకొంటున్నాను. ఆ స్థాయికి ఎదగాలంటే ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. వాటిపై పట్టు సాధించాలి,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.