రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలలో మొదటిరోజు నుంచే తెరాస సర్కార్ పై ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి తెరాస ఊహించని షాక్ ఇచ్చింది. ఇద్దరు సభ్యుల శాసనసభ్యత్వం రద్దు చేసి, మిగిలినవారినందరిపై బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసి బయటకు సాగనంపింది. దీంతో టి-కాంగ్రెస్ నేతలు ఏమిచేయాలో పాలుపోక తలలు పట్టుకొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ 48గంటలు నిరాహార దీక్షకు కూర్చొన్నారు కానీ రాష్ట్ర ప్రజల నుంచి, స్వంత పార్టీ నేతల నుంచి ఆశించిన ప్రతిస్పందన రాలేదు. ఇక మూకుమ్మడి రాజీనామాల ప్రతిపాదనకు ఇంతవరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వస్తే వెంటనే రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
నిజానికి నిన్న మొన్నటివరకు గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఎంపి పదవికి రాజీనామా చేస్తే, లోక్ సభకు పోటీ చేసి గెలిచి తన సత్తా చూపించుకొందామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తహతహలాడారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు అయన పదవే పోయింది. దాంతో అయన ప్రాతినిధ్యం వహిస్తున నల్గొండ నియోజకవర్గానికే ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజీనామాలకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్లయితే, అప్పుడు అందరూ తమ స్థానాలలో తామే పోటీ చేసి వాటిని దక్కించుకోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు కనుక తప్పనిసరిగా వారు ఈ ఉపఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి తమ సత్తా నిరూపించుకోవలసి ఉంటుంది. లేకుంటే టి-కాంగ్రెస్ నేతల పరువు గంగలో కలిసిపోతుంది. అంటే కాంగ్రెస్ ఒకటనుకొంటే జరుగుతున్నది మరొకటి అన్నమాట!