జగన్ మళ్ళీ పప్పులో కాలేస్తున్నారా?

March 10, 2018


img

ఎన్నికలలో ఏపి ప్రజలలో సమైక్యాంధ్ర సెంటిమెంటును రెచ్చగొట్టి తనవైపు తిప్పుకొని అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి విఫలప్రయత్నాలు చేశారు. రాబోయే ఎన్నికలలో ప్రజలలో ప్రత్యేకహోదా సెంటిమెంటును రెచ్చగొట్టి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రత్యేకహోదానే ప్రధాన అజెండాగా ఉండబోతోందని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో రెండేళ్ళక్రితమే చెప్పారు. ఆ ఉద్దేశ్యంతోనే దాని వేడి చల్లారిపోకుండా అప్పుడప్పుడు యువభేరీ పేరిట హడావుడి చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. 

 ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తమ ఎంపిలో రాజీనామా చేస్తారని జగన్ గత ఏడాది ప్రకటించారు కానీ చేయించలేదు. బహుశః రెండేళ్ళు ముందుగా వారిని రాజీనామాలు చేయమని ఒత్తిడి చేసినట్లయితే పదవులు వదులుకోవడానికి ఇష్టపడక వారు తెదేపాలోకి మారిపోయే ప్రమాదం ఉందనే భయం వల్ల లేదా అంత ముందుగా రాజీనామాలు చేయిస్తే ఆ వేడి ఎన్నికల వరకు ఉండదనే ఆలోచన కావచ్చు... వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయించకుండా ఇంతవరకు కాలక్షేపం చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున మార్చి 21న వారిచేత రాజీనామాలు చేయించి నేరుగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేస్తే ప్రజల సానుభూతిని ఓట్ల రూపంలోకి మార్చుకోవచ్చని వైకాపా ఆలోచన కావచ్చు. 

ఇంతకాలం తెదేపా-భాజపాలు ఎప్పుడు విడిపోతాయా..ఎప్పుడు భాజపాతో పొత్తులు పెట్టుకొందామా...అని ఆశగా ఎదురుచూసిన జగన్, ఇప్పుడు ఆ రెండు పార్టీలు తెగతెంపులు చేసుకొన్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, ఈ సమయంలో కేంద్రానికి ఇబ్బంది కలిగించే ప్రత్యేకహోదా అంశంపై ఇంత హడావుడి చేయడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని గ్రహించినట్లు లేదు.

ప్రత్యేకహోదా కోసం ఇంత హడావుడి చేసిన తరువాత ఒకవేళ భాజపాతో పొత్తుల కోసం దానిని పక్కనపెడితే, అదే తెదేపాకు అస్త్రంగా మారుతుంది. ఇక ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేస్తున్న జగన్ తో పొత్తులు పెట్టుకొంటే భాజపా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది. అది వైకాపాతో పొత్తులకు సిద్దపపడితే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని మళ్ళీ హామీ ఈయవలసి ఉంటుంది. కేంద్రప్రభుత్వం ఏపిని నమ్మించి మోసం చేసిందని చెపుతున్న వైకాపా మళ్ళీ దానితోనే చేతులు కలిపితే ఏపి ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చెప్పనక్కరలేదు. 

ఎన్నికలకు ముందు ఏపిలో వైకాపా కోరుకొన్న అనుకూలమైన రాజకీయ వాతావరణం ఏర్పడిఉంది. కనుక జగన్ మళ్ళీ తప్పటడుగులు వేయకుండా ఆచితూచి అడుగులు వేస్తే మంచిది. ఏమైనప్పటికీ, ఏపిలో ప్రత్యేకహోదా అనేది ఆ రాష్ట్రానికి, ప్రజలకు కాక రాజకీయపార్టీలకే ఎక్కువగా ఉపయోగపడటం విశేషం.


Related Post