దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దం అవుతున్నారు. అయితే తెలంగాణా రాష్ట్రం ఇంకా పూర్తిగా నిలద్రొక్కుకోక మునుపే బలమైన మోడీ సర్కార్ తో కయ్యానికి కాలుదువ్వడం వలన రాష్ట్రానికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది కనుక అది తొందరపాటు నిర్ణయమనే వాదన కూడా మొదలైంది.
ఇక కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటే వెళ్ళవచ్చు కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం పార్టీలో తీవ్ర అయోమయం, చీలికలను సృష్టించే ప్రమాదం కూడా ఉండవచ్చు. కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళితే అయన కుమారుడు కేటిఆర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించవచ్చు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీలో ఆ పదవి గురించి మరెవరూ ఆలోచించే సాహసం చేయకపోవచ్చు కానీ తన స్థానంలో తన కుమారుడు కేటిఆర్ ను కూర్చోపెట్టి డిల్లీ వెళ్ళాలనుకొన్నప్పుడు పార్టీలో సీనియర్లలో అసంతృప్తి మొదలవవచ్చు. కనుక అటువంటి వారిని ఎంపిలుగా పోటీ చేయించి కెసిఆర్ తనతో డిల్లీకి తీసుకుపోయే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. దానికి వారు అంగీకరిస్తే మంచిదే లేకుంటే సమస్య మొదలైనట్లే!
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో శాసనసభ సీట్లు పెరిగే అవకాశం లేదని తేలిపోయింది కనుక పార్టీలో పాతవారికీ, కొత్తగా చేరినవారికీ మద్య టికెట్స్ పంపకాల విషయంలో చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఆ కారణంగా పార్టీలో అసంతృప్తి, అలకలు, మళ్ళీ పార్టీ ఫిరాయింపులు ఎలాగూ తప్పవు. కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళకపోయినా ఈ సమస్య ఉంటుంది. కానీ పార్టీలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండగా అయన ధర్డ్ ఫ్రంట్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి తదనుగుణంగా టికెట్లు కేటాయింపులు జరిపితే ఆ అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
తెరాసలో అటువంటి పరిస్థితులే ఏర్పడినట్లయితే అవి దానికి ప్రత్యామ్నాయంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి కలిసిరావచ్చు. అప్పుడు జాతీయ రాజకీయాల మాట దేవుడెరుగు...రాష్ట్ర స్థాయిలోనే తెరాస నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఇక ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు బెడిసికొట్టి కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కారే అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు తెరాసకు, తెలంగాణాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవవచ్చు. కానీ ఒకవేళ ధర్డ్ ఫ్రంట్ కారణంగా కాంగ్రెస్ లేదా భాజపాలు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని ఎంపి సీట్లు గెలుచుకోలేకపోతే, అప్పుడు కెసిఆర్ లేదా ధర్డ్ ఫ్రంట్ కింగ్ మేకర్ అవుతారు కనుక డిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పవచ్చు. ఏమైనప్పటికీ, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు వలన తెరాసకు, తెలంగాణా రాష్ట్రానికి నష్టం కలగకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.