ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలోనే డిల్లీలో ధర్నా చేయబోతున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే తన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో కలిసి డిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెరాస ముస్లిం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కోరుతూ పార్లమెంటు లోపలా బయటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ బిల్లును ఆమోదించలేమని కేంద్రం తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా అయన ఏర్పాటు చేయాలనుకొంటున్న ధర్డ్ ఫ్రంట్ కు ఈ ధర్నా కార్యక్రమంతో డిల్లీ నుంచే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం తనతో కలిసి వచ్చే భావసారూప్యత గల పార్టీలన్నిటినీ ఈ ధర్నా కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల, పార్టీల ఎంపిలు వస్తారు కనుక పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా డిల్లీలో ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లయితే వారిలో వీలైనంతమందిని ఆకర్షించవచ్చునని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ధర్నా కార్యక్రమం గురించి తెరాస అధికారికంగా ప్రకటించవచ్చు.