వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నంత కాలం రెండు తెలుగు రాష్ట్రాలకు డిల్లీలో అన్ని పనులు చకచకా జరుగుతుండేవి. అయన స్వయంగా చొరవ తీసుకొని వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు పూర్తయ్యేలా చేసేవారు. డిల్లీలో అన్ని పనులు ఆయనే చక్కబెట్టేస్తారని కాదు కానీ..యధాశక్తిన రెండు తెలుగు రాష్ట్రాలకు సహాయపడుతుండేవారు. కానీ ఆయనను ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోపెట్టినప్పటి నుంచి అయన చేతులు కట్టేసినట్లయింది. నిజానికి అయన చేతులు కట్టేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోడీ ఆయనను ఆ కుర్చీకి పరిమతం చేశారనే వాదనలు వినిపించాయి. అయన కేంద్రమంత్రి పదవి నుంచి తప్పుకొన్న తరువాత డిల్లీలో తెలుగు రాష్ట్రాలకు సహాయపడే నాధుడే లేకుండాపోయాడు. అప్పటి నుంచే రెండు రాష్ట్రాల పట్ల మోడీ సర్కార్ వైఖరిలో నిర్లక్ష్య వైఖరి కనబడసాగింది. ఆ కారణంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలలో అసహనం మొదలైంది. చివరికి అది తిరుగుబాటుకు దారి తీసింది.
ఆంధ్రా, తెలంగాణా ఎంపిలు వివిధ సమస్యలపై రోజూ పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ఏపిలో తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకొని మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. మరోపక్క అసహనంతో రగిలిపోతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని కేంద్రప్రభుత్వాన్ని డ్డీ కొనేందుకు సిద్దం అవుతున్నారు. ఈ పరిస్థితులకు కేంద్రం మొండి వైఖరి ఒక కారణంగా కనిపిస్తోంది. కానీ వెంకయ్యనాయుడు నేడు కేంద్రమంత్రిగా ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందే ఇరువురు ముఖ్యమంత్రులతో మాట్లాడి తప్పకుండా శాంతింపజేసి ఉండేవారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు కేంద్రమే తనంతట తానుగా దిగి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల న్యాయబద్దమైన డిమాండ్లు తీరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు.
కానీ వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు కనుక కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదు...దిద్దుబాటు చర్యలకు పూనుకోలేదు...కనీసం బాధపడుతున్నట్లు కూడా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల పట్ల భాజపా ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి వాటి వరకే పరిమితం అవుతుందనుకోలేము. త్వరలో జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఆ తరువాత జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో భాజపాపై ఈ ప్రభావం తప్పకుండా పడే అవకాశం ఉంది. వెంకయ్యనాయుడును పక్కకు తప్పించి ఏదో సాధించాలని మోడీ, అమిత్ షాలు భావిస్తే జరుగుతున్నది మరొకటి.