గత ఏడాది ఏప్రిల్ లో తెలంగాణా శాసనసభ ఆమోదించి పంపిన ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపాలంటూ పార్లమెంటులో ఆందోళన చేస్తున్న తెరాస ఎంపిలకు మోడీ సర్కార్ ఇవ్వాళ్ళ పెద్ద షాక్ ఇచ్చింది. తెదేపా ఎంపి దేవేందర్ గౌడ్ దీని గురించి అడిగిన ప్రశ్నకు కేంద్రం హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారాం ఇవ్వాళ్ళ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ‘జనాభా ప్రాతిపదికన ముస్లింలకు అదనంగా రిజర్వేషన్లు కల్పించలేమని అది రాజ్యాంగ విరుద్దమని తేల్చి చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు పేర్కొందని, తెలంగాణా రాష్ట్రంలో ముస్లింలకు అధనంగా రిజర్వేషన్లు కల్పించేందుకు అటువంటి ప్రత్యేక పరిస్థితులున్నట్లు తెలంగాణా ప్రభుత్వం పేర్కొనలేదని కనుక ముస్లింలకు అధనపు రిజర్వేషన్లు కల్పించలేమని’ స్పష్టం చేశారు.
తెలంగాణా ప్రభుత్వం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలనే ఆలోచన చేసినప్పుడే రాష్ట్ర భాజపా నేతలు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. అంటే ఆనాడే వారు దీనిపై కేంద్రప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారని భావించవచ్చు. ఆరోజు వారు చెప్పినట్లుగానే, నేడు కేంద్రం ముస్లిం రిజర్వేషన్ బిల్లును ఆమోదించలేమని తేల్చి చెప్పింది.
కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించి కెసిఆర్ ఇప్పటికే కేంద్రంపై యుద్ధం ప్రకటించేరు. ఇప్పుడు యుద్ధం ప్రారంభించడానికి ఈ ముస్లిం రిజర్వేషన్ బిల్లు ఒక బలమైన ఆయుధం చేతికి అందివచ్చింది. దీనిపై ఇంతవరకు తెరాస ఎంపిలు మాత్రమే పార్లమెంటులో మాట్లాడేవారు కానీ నేడు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఆరు ప్రాంతీయ పార్టీల ఎంపిలు సైతం తెరాస ఎంపిలతో గొంతు కలిపి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. కనుక కెసిఆర్ మొదలుపెట్టిన ఈ యుద్ధంలో ఆ ఆరు పార్టీలు చేరినట్లే భావించవచ్చు.
అయితే ముస్లింలకు రిజర్వేషన్లు పెరగకపోయినా, పెంచాలని తెరాస, మజ్లీస్ తదితర పార్టీలు, పెంచకూడదని భాజపా వాదించుకొంటూ రాజకీయ లభ్ది పొందేందుకు కూడా మార్గం సుగమం అయినట్లే చెప్పవచ్చు. కనుక ముస్లిం రిజర్వేషన్ బిల్లుని కేంద్రం తిరస్కరించడం వలన తెరాస, భాజపాలకు ఎంతో కొంత లాభమే తప్ప కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదని చెప్పవచ్చు.