ప్రధాని మోడీని మనిషిని చేద్దాం: కొరటాల

March 08, 2018


img

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపాకు బలంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. కారణాలు అందరికీ తెలిసినవే. ఈ పరిస్థితులలో సినీ ప్రముఖులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రముఖ రచయితే, దర్శకుడు కొరటాల శివ తాజా పరిస్థితులపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి ఒక మెసేజ్ పెట్టారు. 

“ఏపికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తుచేసి ఆయనను మనిషిగా మారుద్దాం.. రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో అంతర్భాగమేనని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్?” అని మెసేజ్ పెట్టారు. 

కొరటాల శివ పెట్టిన ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొరటాల శివ వంటి మేధావులు కూడా వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయకుండా ఇటువంటి మెసేజులు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపి విషయాన్నే తీసుకొంటే, ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం ఎప్పుడో చెప్పింది. ఇవ్వదనే సంగతి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడో తెలుసునని అందుకే ‘స్పెషల్ ప్యాకేజీ పాట’ పాడుతున్నారని తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రత్యేకహోదాకు బదులు కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ అద్భుతంగా ఉందని...దానితో రాష్ట్రం దివ్యంగా అభివృద్ధి చేసుకోవచ్చని చంద్రబాబు స్వయంగా చెప్పుకొన్నారు. కానీ నాలుగేళ్ళు పూర్తయి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగలేదు. కనీసం తెదేపా ఇచ్చిన హామీలనైనా అమలుచేయలేకపోయింది. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక రాబోయే ఎన్నికలలో ప్రజలు తెదేపాను తిరస్కరించే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆలోచనతోనే చంద్రబాబు భాజపాపై నిందవేసి దానితో తెగతెంపులు చేసుకొన్నారు. కేంద్రం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల అమలు చేయకుండా కుంటి సాకులు చెపుతూ తప్పించుకొంటోంది. అయినప్పటికీ తెదేపా, తెరాసలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నందున అవి ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి. కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంలో కేంద్రానిది ఎంత బాధ్యత ఉందో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు (తెదేపా, తెరాస)లకు కూడా అంతే ఉందని చెప్పక తప్పదు. ఈ సంగతి కొరటాల శివకు తెలియదనుకోలేము. కానీ ఈ రోజుల్లో మంచిచెడ్డ విశ్లేషించి చెప్పేవారి కంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడేవారి పట్లే ప్రజలు కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కనుక కొరటాల వంటి రచయితలు కూడా ‘గుంపులో గోవిందా’ అంటూ సాగిపోతున్నారని సరిపెట్టుకోవాలేమో? 


Related Post