ఒక్కోసారి కొన్ని సినిమాలలో ‘నీ ఊరికొస్తా...నీ వీదికొస్తా...నీ ఇంటికొస్తా..వంటి డైలాగులు లేదా ‘కేక’, ‘కిర్రాకు’ ‘డాడీ’ వంటి కొన్ని పదాలు జనాలకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. అప్పటి నుంచి జనాలు వాటిని అందరూ తెగ వాడేస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతల నోళ్ళలో కూడా అటువంటి పదమే తరచూ వినిపిస్తోంది. అదే ‘నిశబ్ద విప్లవం.’ దానిని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ లో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి వరకు అందరూ తెగ వాడేస్తున్నారు. రాష్ట్రంలో తెరాస పాలనకు వ్యతిరేకిస్తూ నిశబ్ద విప్లవం నడుస్తోందని, వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తెరాసను ఓడించి బుద్ధి చెప్పబోతున్నారని కాంగ్రెస్ నేతలు కోరస్ పాడుతూ బస్సు యాత్రలు చేస్తున్నారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ నేతలు తెరాసను ఎందుకు ఓడించాలో చెపుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలో బలమైన కారణం ఒక్కటీ చెప్పలేకపోతున్నారు. తెరాస నేతలు తమ ప్రభుత్వం చేసి చూపిన, ఇంకా చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల జాబితాను చదివి వినిపించి, కాంగ్రెస్ హయంలో ఏ రంగంలో అభివృద్ధి జరిగింది? జరిగి ఉండి ఉంటే నేడు అన్ని రంగాలలో ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి? అని ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల వద్ద సంతృప్తికరమైన జవాబు లభించడం లేదు. బహుశః అందుకేనేమో ఈ ‘నిశబ్ద విప్లవం’ అనే పదాన్ని కనిపెట్టినట్లున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఉద్యోగాల కల్పన, దళితులకు 3 ఎకరాల భూమి వంటి కొన్ని హామీలను తెరాస సర్కార్ అమలు చేయలేకపోతున్న మాట వాస్తవం. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తెరాస సర్కార్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటి ఫలాలు లభించడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ఈలోగా పంటలు సరిగ్గా పండకపోవడం, పండించినవాటికి గిట్టుబాటు ధర లభించకపోవడం, ఇంకా అనేక సమస్యల కారణంగా రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారన్నమాట కూడా వాస్తవం. ఆ కారణంగా రైతులలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండవచ్చు.
అలాగే నిరుద్యోగ సమస్య కారణంగా యువతలో, దాడులకు గురవుతున్న కారణంగా దళితులలో అసంతృప్తి నెలకొని ఉండటం సహజం. అయితే ఈ సమస్యలన్నిటి పరిష్కారానికి తెరాస సర్కార్ చాలా చిత్తశుద్ధితో తీవ్రంగా కృషి చేస్తోందనే సంగతి కూడా వారికి తెలుసు.
కాంగ్రెస్ పాలనలో ఎన్నడూ జరుగనివి...కనీసం ఊహించలేని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా జోరుగా సాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ప్రభుత్వం పట్ల కొన్ని వర్గాల ప్రజలలో ఎంత అసంతృప్తి నెలకొని ఉన్నప్పటికీ, అది కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నట్లు ‘నిశబ్ద విప్లవం’గా మారే అవకాశం లేదు. ఎందుకంటే తెరాసను కాదనుకొని మళ్ళీ కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకొంటే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక ఒకవేళ ప్రజలలో తెరాస సర్కార్ పాలన పట్ల అసంతృప్తి నెలకొని ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలలో అది కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టే అంత ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.