ఏపి శాసనసభ వేదికగా భాజపా-తెదేపాలు తెగతెంపులు చేసుకోవడానికి సిద్దపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వాదిస్తూ గత కొన్ని రోజులుగా పార్లమెంటులోపల, బయట మోడీ సర్కార్ కు నిరసనలు తెలియజేస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో తెదేపా, భాజపా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టేశారు.
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి భాజపాతో సంబంధాలు కొనసాగించాలా వద్దా అని అభిప్రాయాలూ కోరగా 95 శాతం మంది తెగతెంపులు చేసుకోవడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక శాసనసభ సాక్షిగా భాజపాతో శాస్త్రోక్తంగా తెగతెంపులు చేసుకొనేందుకు తెదేపా సిద్దం అయ్యింది. ఆ ప్రయత్నంలోనే తెదేపా శాసనసభ సభ్యులు నాలుగేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలుచేయలేదని, ఏపికి ప్రత్యేకహోదాతో సహా విభజన చట్టంలో అన్ని హామీలను కేంద్రం అమలుచేయాలని గట్టిగా వాదించారు. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు యధాప్రకారం గణాంకాలతో సహా వారికి గట్టిగ సమాధానం ఇచ్చారు.
వారి వాగ్వాదాల తరువాత ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయన భాజపాతో తెగతెంపులు చేసుకొంటామని ప్రకటించిన మరుక్షణం, తెదేపా సర్కార్ లో మంత్రులుగా ఉన్న డాక్టర్ కామినేని శ్రీనివాస్, పి. మాణిక్యాల రావు రాజీనామాలు చేసి ప్రభుత్వంలో నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాలని భాజపా అధిష్టానం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఇక్కడ భాజపా మంత్రులు రాజీనామాలు చేస్తే, అక్కడ కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న అశోక్ గజపతి రాజు, సుజన చౌదరి కూడా రాజీనామాలు చేసే అవకాశాలున్నాయి. కనుక మరికొద్ది సేపటిలో తెదేపా-భాజపాల మద్య పొత్తులు కొనసాగుతాయా లేక తెగతెంపులు చేసుకొంటాయా? అనే విషయం తేలిపోతుంది. చంద్రబాబు నాయుడు బహుశః ఈ తెగతెంపుల సీరియల్ ను మరికొన్ని రోజులు సాగదీసినా ఆశ్చర్యం లేదు.