మళ్ళీ చక్రం తిప్పబోతున్న కెకె

March 07, 2018


img

‘కెకె’గా అందరికీ సుపరిచితులైన కే కేశవ్ రావు తెరాసలో చేరినప్పుడు పార్టీలో అయన చాలా కీలకపాత్ర పోషిస్తారని చాలా మంది అనుకొన్నారు కానీ ఆయన పార్టీ సెక్రెటరీ జనరల్ పదవితో సరిబెట్టుకోవలసి వచ్చింది. ఆ తరువాత ఎంపి పదవి లభించింది. అంతే! అంతకు మించి తెరాసలో అయనకు ఎటువంటి గుర్తింపు, ప్రాధాన్యత లభించలేదు. ఒకప్పుడు అయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏదో ఒక రాజకీయ అంశం గురించి మాట్లాడుతూ నిత్యం మీడియాలో కనబడుతుండేవారు కానీ తెరాసలో చేరిన తరువాత కెసిఆర్ వెనుక నిలబడి అయన చెప్పే మాటలకు తలూపడమే తప్ప మాట్లాడిన సందర్భాలు చాలా తక్కేవే. కానీ ఇప్పుడు కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్లాలని నిశ్చయించుకోవడంతో కెకె మళ్ళీ చక్రం తిప్పబోతున్నట్లు తెలుస్తోంది.  

అయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా పనిచేశారు. అలాగే డిల్లీలో వివిధ జాతీయ పార్టీల రాజకీయ నాయకులతోనూ కె కేశవ్ రావుకు మంచి పరిచయాలున్నాయి. వాటిని ఇపుడు కెసిఆర్ కోసం ఉపయోగించుకోబోతున్నారు. ఆ పరిచయాల కారణంగానే మమతా బెనర్జీ, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లతో మాట్లాడి కెసిఆర్ తో చేతులు కలిపేందుకు అంగీకరింపజేసినట్లు సమాచారం. కనుక త్వరలోనే కెకె డిల్లీకి మకాం మార్చి అక్కడ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చునని తెలుస్తోంది. ఇన్నేళ్ళ తరువాత తెరాసకు కెకె అవసరం పడటం, అందుకు అయన సహకరించడం హర్షించవలసిన విషయమే.


Related Post