ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఇప్పుడు భాజపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలలో కూడా తమ జెండాలు రెపరెపలాడాలని భాజపా అగ్రనేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. త్వరలో జరుగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికలతోనే దక్షిణాది రాష్ట్రాలలో తమ విజయయాత్ర మొదలుపెట్టాలని భాజపా భావిస్తోంది.
కర్ణాటకలో విజయం సాధిస్తే ఆ తరువాత రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అది తమకు సానుకూలంగా మారుతుందని భాజపా భావిస్తోంది. అటువంటప్పుడు భాజపా మరింత వినయంగా..తెలివిగా వ్యవహరిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలి. కానీ అందుకు పూర్తి విరుద్దం జరుగుతున్న విగ్రహాల విద్వంసం భాజపా ప్రతిష్టను మంటగలిపేస్తున్నాయి. అవి భాజపా మతతత్వవాదాన్ని మళ్ళీ ప్రజలకు గుర్తుచేస్తున్నాయి. ఆ పార్టీకి ఓటేస్తే పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో కొందరు హిందుత్వవాదులు ప్రజలకు రుచి చూపిస్తున్నారు.
యూపిలో భాజపా తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాగానే, ‘గోవధ నిషేధం’ పేరిట యోగీ సర్కార్ రాష్ట్రంలో ఒక అత్యవసర పరిస్థితి వంటి పరిస్థితులను సృష్టించడం అందరూ చూశారు. కేంద్రం కూడా దానికి వంత పాడటంతో ఉత్తరాది రాష్ట్రాలలో పుట్టుకొచ్చిన ‘గోరక్షక్’ లు మైనార్టీలు, దళితులపై దాడులకు తెగబడి నానా బీభత్సం సృష్టించడం అందరూ చూశారు. అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కలుగజేసుకొని గట్టిగా హెచ్చరించడంతో ‘గోరక్షక్’ ల హడావుడి తగ్గింది.
త్రిపురలో 25 ఏళ్ళుగా రాజ్యం ఏలుతున్న సిపిఎంను గద్దె దించి భాజపా కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో, అక్కడా హిందుత్వవాదులు రెచ్చిపోయి లెనిన్ విగ్రహాలను ద్వంసం చేయడం మొదలుపెట్టారు. దీని గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తుండగానే అది తమిళనాడుకు కూడా పాకిపోయింది. ‘త్రిపురలో లెనిన్ విగ్రహాలకు పట్టిన గతే తమిళనాడులో పెరియార్ విగ్రహాలకు కూడా పడుతుందని’ తమిళనాడులోని సీనియర్ భాజపా నేత హెచ్.రాజా సోషల్ మీడియాలో ఒక హెచ్చరిక పోస్ట్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వెల్లూరులో గుర్తు తెలియని వ్యక్తులు పెరియార్ విగ్రహం కూల్చి వేశారు.
ఈ విగ్రహాల కూల్చివేత కార్యక్రమం జోరందుకోవడంతో దేశ వ్యాప్తంగా కలకలం మొదలైంది. దాంతో ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ మరోసారి జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నవారిపై కటిన చర్యలు తీసుకోవలసిందిగా అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తీవ్రంగా స్పందించారు. అటువంటి వారితో భాజపాకు ఎటువంటి సంబంధమూ లేదని, విగ్రహాల విద్వంసానికి పాల్పడినవారిపై కటిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అప్పుడు గోరక్షక్..ఇప్పుడు విగ్రహాల కూల్చివేతల కారణంగా భాజపా పట్ల ప్రజలకు దురాభిప్రాయం కలిగే అవకాశం ఉంది. దాని ప్రోత్సాహంతోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయని కనుక భాజపాకు ఓటేసి గెలిపిస్తే తమకే ప్రమాదమని దేశప్రజలు భావించినట్లయితే దానికే నష్టం జరుగుతుంది. కనుక దళితులు, మైనార్టీ ప్రజలపై దాడులకు పాల్పడేవారిని, విగ్రహాలను ద్వంసం చేస్తున్నవారిపై కటినంగా చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే నష్టపోయేది భాజపాయే.