టి-కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర మంగళవారం రాత్రికి జగిత్యాల జిల్లాలో మెట్ పల్లికి చేరుకొంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.
“ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు కెసిఆర్ ప్రకటించగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి అభినందించి మద్దతు తెలిపారని కెసిఆర్ చెప్పుకొంటున్నారు. కానీ కెసిఆరే స్వయంగా ఆమెకు ఫోన్ చేసి ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడారని ఆ రాష్ట్రంలో ప్రముఖ పత్రిక ‘టెలిగ్రాఫ్’ లో వార్త వచ్చింది. అలాగే జార్ఖండ్ నేత హేమంత్ సోరెన్ తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని డిల్లీలో చెప్పగా, అయన తనతో కలిసి పనిచేస్తానని కెసిఆర్ చెప్పుకొంటున్నారు. అలాగే ఛత్తీస్ ఘడ్ నేత అజిత్ జోగీ కూడా తనకు మద్దతు పలికారని కెసిఆర్ చెప్పుకొంటున్నారు. కెసిఆర్ స్వయంగా వివిధ రాష్ట్రాల నేతలకు ఫోన్లు చేసి ధర్డ్ ఫ్రంట్ కు మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నాలు చేస్తూ, దేశం నలుమూలల నుంచి తనకు మద్దతు లభిస్తోందని అబద్దాలు చెప్పుకొంటూ మీడియాలో పతాక శీర్షికలలో తన పేరువచ్చేలా చేసుకొంటూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు. నిజానికి మేము బస్సు యాత్రతో ప్రజల వద్దకు బయలుదేరడంతో కెసిఆర్ కు కంగారు పుట్టి ప్రజల దృష్టిని తనవైపు మళ్ళించుకోవడానికే ఈ సరికొత్త ధర్డ్ ఫ్రంట్ డ్రామా మొదలుపెట్టారు,”అని ఎద్దేవా చేశారు.
ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల నేతలు మద్దతు పలకడం గురించి కెసిఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఎవరు చెపుతున్న మాటలు నిజమనే విషయం ఎలాగూ త్వరలోనే తెలుస్తుంది. తనకు ఎవరూ మద్దతు పలుకకపోయినా అందరూ మద్దతు పలుకుతున్నారని కెసిఆర్ అబద్దాలు చెప్పుకొంటే చివరికి ఆయనే నవ్వులపాలవుతారు. కనుక అబద్దాలు చెప్పుకోవలసిన అవసరం కెసిఆర్ కు లేదనే చెప్పవచ్చు.
ఇక ఎవరు ఎవరికి ఫోన్ చేసినా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటవుతోందా లేదా? ఇతర రాష్ట్రాల నేతలు కెసిఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడతారా లేక వేరెవరికైనా దాని బాధ్యతలు అప్పగించి కెసిఆర్ దానిని బలోపేతం చేయడానికే పరిమితమవుతారా? అనే విషయం కూడా త్వరలోనే తేలిపోతుంది. కనుక తినబోతూ గారెల రుచి ఎలా ఉందని అడగడం దేనికి?