అవి రాష్ట్రానికి గుదిబండగా మారనున్నాయి: రావుల

March 06, 2018


img

రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్న తెలంగాణా ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేసి అనేక చిన్నా, పెద్ద, బారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అవి వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో చాలా ప్రాజెక్టులు 2018 చివరిలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని మంత్రి హరీష్ రావుతో సహా సాగునీటి పారుదలశాఖ అధికారులు, కార్మికులు, కాంట్రాక్టర్లు రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. కనుక త్వరలోనే ఒక్కొక్కటీ పూర్తవుతుంటే వాటి నుంచి నీటి విడుదలవడం ఖాయమే. 

ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు చూస్తే, వీటిలో మెజారిటీ ప్రాజెక్టులు ఎత్తిపోతల ప్రాజెక్టులే. అంటే పంపులతో నీళ్ళు తోడి పోస్తుండాల్సిందే. అంటే బారీగా విద్యుత్ వినియోగం అవుతుందన్నమాట! మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తయి పనిచేయడం ప్రారంభిస్తే వాటికి 15,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని టిటిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆ లెక్కన ఒక ఎకరానికి నీళ్ళు అందించడానికి సుమారు రూ.50,000 ఖర్చు చేయవలసివస్తుందని, అంత భారం రాష్ట్ర ప్రభుత్వం భరించగలదా?అని ప్రశ్నించారు. 

పంటలపై వచ్చే రాబడి ఎంత గొప్పగా ఉంటోందో అందరూ చూస్తూనే ఉన్నారు. పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆర్ధిక సమస్యలతో చిక్కుకొంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. పంటలపై వచ్చే రాబడి కంటే విద్యుత్ భారమే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవిధంగా లాభదాయకం? ఇక ఈ ప్రాజెక్టుల కోసం తెస్తున్న వేలకోట్ల రుణాలు, మళ్ళీ వాటిపై వడ్డీల భారం కూడా ఉండనే ఉంది. ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం, విద్యుత్ చార్జీలకు ప్రభుత్వం ఏవిధంగా ఆదాయం సమకూర్చుకొంటుంది? ఆ భారం ఎవరిపై మోపుతుంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఎత్తిపోతల పధకాల ద్వారా తప్ప మరోవిధంగా పంటలకు సాగునీరు అందించడం అసాధ్యమే. కనుక ఈ ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ చార్జీల కోసం శాశ్విత ఆదాయవనరును సృష్టించవలసిన అవసరం చాలా ఉంది. లేకుంటే రావుల హేచ్చారిస్తున్నట్లుగా అవి రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదం ఉంటుంది.


Related Post