కాంగ్రెస్ తో కోదండరాం పొత్తులు?

March 06, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ‘కాంగ్రెస్ ఏజంట్’ అని తెరాస ఆరోపిస్తూనే ఉంది. కాంగ్రెస్ తరపున మేధావి ముసుగులో అయన తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెరాస ఆరోపింస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రొఫెసర్ కోదండరాం సన్నిహితంగా మెలుగుతున్నారు కనుకనే తెరాస ఆవిధంగా ఆరోపణలు చేస్తోందని చాలా మంది భావిస్తున్నారు. అయితే అందరూ ఊహించినట్లుగా అయన కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తెలంగాణా జన సమితి (టిజెఎస్) అనే కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించి అనుమానాలకు ముగింపు పలికారు. అయితే అయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోబోతున్నట్లు తాజా సమాచారం. 

తెలంగాణా జన సమితి (టిజెఎస్) ఇంకా ఏర్పడక మునుపే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఖరారయినట్లు వార్తలు రావడం విచిత్రమే కానీ నిజమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 85, టిజెఎస్ 15-20 స్థానాలలో పోటీ చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 5-6 సీట్లను ఆ రెండు పార్టీలతో కలిసివచ్చే వాటికి కేటాయించాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. 

మార్చి 10వ తేదీన హైదరాబాద్ లేదా వరంగల్ లో టిజెఎస్ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించాలని భావిస్తోంది. ఆ సభలో ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీతో పొత్తుల గురించి ప్రకటించి స్పష్టత ఇస్తారేమో చూడాలి. 



Related Post