ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలే కాకుండా వివిధ రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అయన ప్రతిపాదనకు వివిధ రాష్ట్రాల నేతల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం విశేషం. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలవైపు కెసిఆర్ మొదలుపెట్టిన పయనాన్ని గమనిస్తే ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్తానం కూడా ఇంచుమించు ఇలాగే సాగిందని అర్ధమవుతుంది. వారిద్దరి రాజకీయ జీవితాలలో దగ్గర పోలికలు ఉండటం మరో విశేషం.
నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. దేశానికి ‘గుజరాత్ నమూనా’ అభివృద్ధిని పరిచయం చేసి దేశప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. అయితే అయన దానికి ఒకటి-రెండు దశాబ్దాల సమయం తీసుకొన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలను, పరిపాలనా దక్షతను చూసిన ప్రజలు, గుజరాత్ ను అభివృద్ధి చేసి చూపినట్లుగానే దేశాన్ని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపగలరనే నమ్మకంతో కేవలం ‘అయన మొహం చూసి’ ఎన్డీయే కూటమికి ఓట్లేసి గెలిపించి అధికారం కట్టబెట్టారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన బాటలోనే సాగుతూ గడచిన మూడున్నరేళ్ళలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసి చూపించి దేశ ప్రజల చేత శభాష్ అనిపించుకొంటున్నారు. అయితే ఇక్కడే నరేంద్ర మోడీకి కెసిఆర్ కు చిన్న వ్యత్యాసం కనబడుతోంది. మోడీ తనంతటతానుగా జాతీయ రాజకీయాలలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. 2014 ఎన్నికల సమయంలో దేశంలో నెలకొన్న అరాచక పరిస్థితులను చక్కదిద్దేందుకు నరేంద్ర మోడీయే సరైనవారని భావించిన భాజపా ఆయనను తన ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో అయన జాతీయ రాజకీయాలలో ప్రవేశించి తన సత్తా చాటుకొంటున్నారు.
కానీ కెసిఆర్ తనంతట తానుగా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తుండటమే కాక ఆయనే చొరవ తీసుకొని ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే దానికి తానే నాయకత్వం వహించడానికి సిద్దమని ప్రకటించారు కూడా. అంటే మోడీ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సత్తా చాటుకొంటే, కెసిఆర్ తన సత్తా చాటుకోవడానికి స్వయంగా అవకాశం కల్పించుకొంటున్నారని అర్ధమవుతోంది.
ఇక ఇద్దరిలో పోలికల గురించి చెప్పుకొంటే...ఇద్దరికీ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇద్దరూ స్వయంకృషితో పైకి ఎదిగినవారే. ఇద్దరికీ మొండి పట్టుదల ఎక్కువే. ఇద్దరూ మంచి వాక్చాతుర్యం కలిగినవారే. ఇద్దరూ గొప్ప రాజకీయ చతురత కలిగిన గొప్ప నాయకులే. ఇద్దరూ అభివృద్ధి మంత్రం జపిస్తూ ముందుకు సాగుతున్నవారే. ఇద్దరూ తమ సత్తా చాటుకొని గుర్తింపు సంపాదించుకొన్నవారే. ఇద్దరిలో నిరంకుశ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ కారణంగా ఇద్దరి పట్ల ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఒక సమర్ధుడైన నాయకుడు (కెసిఆర్) మరొక సమర్ధుడైన నాయకుడి (మోడీ) పాలన బాగోలేదని భావించి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తుండటమే చాలా విచిత్రంగా ఉంది.