ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రకటనకు ముందు దానిపై చాలా లోతుగా అధ్యయనం చేసినట్లు దానికోసం ఆయన చేస్తున్న ఏర్పాట్లను బట్టి అర్ధం అవుతోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఆయన ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు తదితర నగరాలలో వివిధ రంగాలకు చెందిన రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఅర్ఎస్ అధికారులతో ఆ తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వివిద శాఖలలో పనిచేసి పదవీ విరమణ ఉన్నతాధికారులతో, ఆ తరువాత రక్షణ రంగంలో పనిచేసిన అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తారు. వాటిలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, దేశ అవసరాలు, దేశంలో ఉన్న వనరులు, వాటి వినియోగం మొదలైన అంశాలపై లోతుగా చర్చిస్తారు. వారందరి సూచనలు, సలహాల ప్రకారం ఒక అజెండాను రూపొందిస్తారు. బహుశః దీని కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చు. ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి వారికీ తన ప్రణాళికను వివరించి ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు వారి సహకారం కోరుతారు.
చివరిగా కాంగ్రెస్, భాజపాలను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలతో డిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణా రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వాటి ఫలితాల గురించి వివరించి, ధర్డ్ ఫ్రంట్ లో చేరేందుకు ఆసక్తిచూపిన పార్టీలతో కలిసి దాని ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తారు. కెసిఆర్ స్పీడు చూస్తుంటే వచ్చే ఎన్నికలలోగానే దీనిని సిద్దం చేసి కాంగ్రెస్, భాజపాలకు డ్డీ కొనడానికి సిద్దం అవుతున్నట్లున్నారు.
అయితే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు పదవులు, అధికారంపై యావే తప్ప దేశాన్ని, తమ రాష్ట్రాలను చక్కదిద్దుకోవాలనే తపన లేదనేది చేదు నిజం. ఉండి ఉంటే నేడు ఈ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయవలసిన అవసరమే ఉండేది కాదు.
కనుక స్వార్ధ రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించే వివిధ పార్టీల నేతలు కెసిఆర్ మాటలకు తలూపి అయనతో చేతులు కలిపినప్పటికీ, వారి అధికార దాహమే ధర్డ్ ఫ్రంట్ కుప్పకూలిపోవడానికి కారణం కావచ్చు. లేదా ఎన్నికలకు ముందే అది విచ్చినం అయినా ఆశ్చర్యం లేదు. కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం, దానికి చక్కటి విధివిధానాలు ఏర్పాటు చేయడం కంటే ఈ సమస్యను అధిగమించడమే చాలా కష్టం. పైగా అవినీతి, అక్రమాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పార్టీల నేతలతో ధర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తే దానిని ప్రజలు ఆదరించరు. ఇటువంటి పరిస్థితులలో ధర్డ్ ఫ్రంట్ ఆలోచనను ఆచరణలోకి తెచ్చి దానిని విజయవంతంగా నడిపించగలిగితే కెసిఆర్ తిరుగులేని నాయకుడుగా దేశచరిత్రలో శాస్వితంగా నిలిచిపోతారు.