కెసిఆర్ నిర్ణయంపై స్పందనలు

March 05, 2018


img

వచ్చే ఎన్నికలలో భాజపాతో తెరాస పొత్తులు పెట్టుకొంటుందా లేదా? పెట్టుకొని కవిత కేంద్రమంత్రి పదవి తీసుకొంటారా లేదా? అని ఇంతకాలం చర్చ నడిచేది. కానీ కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు కెసిఆర్ చేసిన తాజా ప్రతిపాదనతో ఆ చర్చలకు తెరదించడమే కాకుండా, తానే స్వయంగా డిల్లీలో చక్రం తిప్పబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే దాదాపు నాలుగేళ్ళు మోడీకి అన్నివిధాల సహకరించి, ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో హటాత్తుగా మోడీ సర్కార్ విధానాలు బాగోలేవని, భాజపాను (మోడీని) గద్దె దించాల్సించేనని, దానికి తానే నాయకత్వం వహిస్తానని కెసిఆర్ చెప్పడం చాలా నాటకీయంగా కనిపిస్తోంది.  

కెసిఆర్ చేసిన ఈ తాజా ప్రకటనపై ఎవరికి తోచిన సమాధానాలు వారు చెప్పుకొంటున్నారు. లేదా వివిధ పార్టీలు తమ దృష్టి కోణంలో నుంచి చూస్తూ బాష్యం చెపుతున్నాయి.                

కేంద్రం వైఖరి మారుతుందేమోనని దాదాపు నాలుగేళ్ళు సహనంగా ఎదురుచూశామని కానీ మోడీ సర్కార్ కూడా కాంగ్రెస్ విధానాలనే ఫాలో అవుతూ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గురించి ఆలోచించక తప్పలేదని తెరాస నేతలు చెప్పుకొంటున్నారు. 

కెసిఆర్, కేటిఆర్ ల భజనలో తరించిపోతున్న అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ యధాప్రకారం కెసిఆర్ భజన చేసి, మోడీని.. భాజపా హిందుత్వవాదాన్ని, కాంగ్రెస్ అసమర్ధతను తిట్టిపోసి కెసిఆర్ కు మద్దతు పలికారు. 

కేంద్రం కర్ర పెత్తనం చేస్తోందని తరచూ విమర్శలు గుప్పించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహజంగానే కెసిఆర్ కు మద్దతు ఇచ్చారు. తెలంగాణాను అభివృద్ధిపధంలో నడిపించి చూపుతున్న అయన జాతీయ రాజకీయాలలోకి వస్తే తప్పకుండా మద్దతు ఇస్తానని చెప్పారు. 

రాష్ట్ర కాంగ్రెస్ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “గత నాలుగేళ్ళుగా మోడీని చూసి భయపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. నోట్లరద్దు, జి.ఎస్.టి., రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కేంద్రానికి కెసిఆర్ మద్దతు పలికారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు హటాత్తుగా మోడీ విధానాలు బాగోలేదు...ఫెడరల్ స్ఫూర్తి...ఫెడరల్ ఫ్రంట్ అంటూ సరికొత్త నాటకం మొదలుపెట్టారు. ఇది తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టిని మళ్ళించడానికే తప్ప ఫ్రంటూ లేదు మన్నూ కాదు. భాజపా-తెరాసల మద్య లోపాయికారి స్నేహం కొనసాగుతూనే ఉంది. అలాగే తెరాస, మజ్లీస్ పార్టీల మద్య కూడా బలమైన బంధం ఉంది. కనుక తెరాస, మజ్లీస్ పార్టీలకు ఓట్లేస్తే, మోడీకి వేసినట్లే అవుతాయని ప్రజలు గమనించాలి. భాజపాను దించడం ప్రాంతీయ పార్టీలైన తెరాస, మజ్లీస్ పార్టీల వల్ల అసాధ్యం. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే భాజపాను గద్దె దించగలదు,” అన్నారు.

కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు పధకాల పేర్లు మార్చుతాయే తప్ప వాటి వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదని కెసిఆర్ వాదిస్తుంటే, కేంద్ర పధకాలకు పేర్లు మార్చి వాటిని తనవిగా తెరాస సర్కార్ ప్రచారం చేసుకొంటోందని కె జానారెడ్డి ఆరోపించడం విశేషం. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కెసిఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని పగటి కలలు కంటున్నారని, అవి ఎన్నటికీ నేరవేరవని జానారెడ్డి అన్నారు.


Related Post