నేటి నుంచి ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగం భాజపాతో తెగతెంపులకు తెదేపా వేసిన తొలి అడుగులా ఉంది. గత మూడున్నరేళ్ళలో అయన చేసిన ప్రసంగాలలో ఏపి రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధిలో దూసుకుపోతోందో...దానికోసం చంద్రబాబు నాయుడు సర్కార్ ఎంతగా కష్టపడుతోందో వివరించేవారు. ఈరోజు అయన చేసిన ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో ఏపి అన్ని రంగాలలో దూసుకుపోతోందని చెప్పారు. ఏపి వృద్ధిరేటు 11.3 శాతం వృద్ధిరేటు ఉందని, అది జాతీయవృద్ధి రేటు కంటే 6.97 శాతం ఎక్కువని చెప్పారు. ఒకపక్క ఏపి అభివృద్ధిపధంలో దూసుకుపోతోందని చెపుతూనే విభజన చట్టంలోని హామీలను నేటికీ కేంద్రం అమలు చేయకపోవడం వలన రాష్ట్రం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నొక్కి చెప్పారు.
ఆర్దికలోటు భర్తీ, ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం మొదలైనవాటికి కేంద్రం తగిన సహాయసహకారాలు అందించకపోవడం వలన ఎక్కడివక్కడ నిలిచిపోయాయని, ఆ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా అసహనంగా ఉన్నారని అన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదాల ప్రస్తావన కూడా వచ్చింది. షెడ్యూల్ 9, 10 క్రింద వచ్చే సంస్థల పంపకాలు ఇంతవరకు పూర్తవలేదని ఆక్షేపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్నే గవర్నర్ నరసింహన్ చదువుతారు తప్ప అది అయన వ్యక్తిగత అభిప్రాయాలు కావని అందరికీ తెలిసిందే. కనుక గవర్నర్ నరసింహన్ ద్వారా కేంద్రాన్ని నిందించడమంటే, భాజపాతో తెగతెంపులు చేసుకోవడానికి తెదేపా సిద్దం అయినట్లే భావించవచ్చు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగానే తెదేపా ఎంపిలు, ఇద్దరు కేంద్రమంత్రులు కూడా రాజీనామాలు చేసి ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేస్తే తెగతెంపుల తంతు పూర్తయిపోయినట్లే! ఆ తరువాత ఏపి సర్కార్ లో ఇద్దరు భాజపా మంత్రులు రాజీనామాలు చేయడం లాంఛనప్రాయమే. ఆ తరువాత ఎన్నికల వరకు తెదేపా-భాజపాలు ఒకదానినొకటి, ఆ రెంటినీ కలిపి కాంగ్రెస్, వైకాపాలు తిట్టుకొంటూ ప్రజల ముందుకు వెళ్ళి నిలబడబోతున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత ఎపిలో ఏర్పడిన అయోమయపరిస్థితి కంటే, రాబోయే ఎన్నికలలో ఇంకా ఎక్కువ అయోమయం, గందరగోళ పరిస్థితులు ఏర్పడటం కూడా ఖాయమే. అవి జగన్మోహన్ రెడ్డికి అనుకూలించినా ఆశ్చర్యం లేదు.