ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నట్లు చేసిన అనూహ్య ప్రకటనతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారని చెప్పక తప్పదు. అదే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ప్రతిపాదన చేసి ఉండి ఉంటే ఎవరూ పట్టించుకొని ఉండేవారుకారేమో. ఎందుకంటే, ఈ మూడున్నరేళ్ళ పాలనలో కెసిఆర్ చేపట్టిన అనేక అభివృద్ధి, వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు కేంద్రప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు మెచ్చుకొంటున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని తమతమ రాష్ట్రాలలో కూడా అమలుచేస్తున్నాయి. కనుక రాష్ట్రాభివృద్ధి పట్ల కెసిఆర్ చిత్తశుద్ధిని, అయన పరిపాలనాదక్షతను, నాయకత్వ లక్షణాలను యావత్ దేశప్రజలు గుర్తించారు. జాతీయ రాజకీయాలలో గుణాత్మక మార్పు సాధించి తద్వారా దేశంలో కూడా ‘కళ్ళకు కనబడేటువంటి మార్పు’ కోసం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించగానే చాలా మంది ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు.
అయితే రాష్ట్రం కోసం ఇదేవిధంగా పనిచేస్తూ జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం అసాధ్యం. అది రెండు పడవలలో కాళ్ళు పెట్టి ప్రయాణించడమే అవుతుంది. కనుక వచ్చే ఎన్నికలలో కెసిఆర్ లోక్ సభకు పోటీ చేయవచ్చు. అప్పుడు అయన స్థానంలో అయన కుమారుడు కేటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. కేటిఆర్ ఇప్పటికే పార్టీపై, ప్రభుత్వంపై మంచిపట్టు సాధించగలిగారు. అన్నివిధాల సమర్ధుడని మంచి పేరు సంపాదించుకొన్నారు. కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో తెరాస గెలిస్తే కేటిఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి కెసిఆర్ డిల్లీకి షిఫ్ట్ అవవచ్చు. ఇదే నిజమనుకొంటే, ఏప్రిల్ 27న జరుగబోయే తెరాస ప్లీనరీ సమావేశాలలోనే కేటిఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవచ్చు.