జాతీయ రాజకీయాలలోకి కెసిఆర్?

March 03, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవ్వాళ్ళ సాయంత్రం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే తను జాతీయస్థాయి రాజకీయాలలోకి వెళ్ళడానికి వెనుకాడనని అనడం విశేషం. “కాంగ్రెస్, భాజపాల పాలన దొందూ దొందే అన్నట్లుగా సాగుతోంది. కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పధకాల పేర్లు మారుతున్నాయే తప్ప వాటి వల్ల క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఉంది కనుక భారత రాజకీయాలలో మార్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలను పునర్నిర్వచించవలసి ఉంది. రాష్ట్రాల హక్కులు, నిధుల పంపిణీ మొదలైన అంశాలలో కూడా పెనుమార్పులు చేయవలసిన అవసరం ఉంది. దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం అవసరమైన వారితో చర్చిస్తున్నాము.  అది ధర్డ్ ఫ్రంటో మరొకటో కావచ్చు. అలాగే పరిస్థితులను బట్టి సరైన నాయకుడు పుడతాడు. అవసమైతే నేనే నాయకత్వం వహిస్తాను. వెనుకాడబోను,” అని అన్నారు.

ఈశాన్య రాష్ట్రాలలో భాజపా విజయకేతనం ఎగురవేయడంతో ఇక యావత్ దేశం మాదే..మేమే ఏలబోతున్నామని... భాజపా నేతలు గర్వంగా చెప్పుకొంటున్న సమయంలో, కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని, దానికి అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానని చెప్పి కెసిఆర్ పెద్ద బాంబు పేల్చారు. రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయమని చెప్పుకొంటుంటే, మోడీ సర్కార్ కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పి కెసిఆర్ భాజపా అధిష్టానానికి షాక్ ఇచ్చారు. 

పంటి చికిత్స కోసమని డిల్లీ వెళ్ళినప్పుడు కెసిఆర్ వివిధ పార్టీల నేతలతో మంతనాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమేనని కెసిఆర్ మాటలు దృవీకరిస్తున్నాయి. ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ అధికార దాహం, పదవీలాలసతోనే చేతులు కలిపినందున వాటి ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు కెసిఆర్ నాయకత్వంలో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటయితే అవి కలిసి పనిచేయగలవో లేదో చూడాలి. 


Related Post