కొత్తపార్టీ కదా..ఎవరికి ఎన్ని సీట్లైనా ఇవ్వగలదు

March 03, 2018


img

సిపిఎం నేతృత్వంలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, దాని స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిసి కాంగ్రెస్, తెరాసలకు సవాలు విసిరారు. ఆర్ధిక, సామాజిక రంగాలలో అన్ని వర్గాలకు సమానత్వం కల్పించడానికే బిఎల్ఎఫ్ ఉద్భవించిందని కనుక రాష్ట్రంలో బిసి జనాభా ప్రాతిపదికన రాబోయే ఎన్నికలలో బిసిలకు 60-65 టికెట్లు కేటాయించబోతున్నామని చెప్పారు. బిసిలను ఉద్దరిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్, తెరాసలు కూడా తమతో సమానంగా బిసిలకు అన్ని సీట్లు గలవా? అని సూర్య ప్రకాష్ సవాలు విసిరారు. రాబోయే ఎన్నికలలో బిసిలకు 60 సీట్లు కేటాయించి కాంగ్రెస్, తెరాసలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాలు విసిరారు. రూ.70,000 కోట్ల మిగులు బడ్జెట్ తో చేతికి అందిన తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు రెండు లక్షల కోట్ల అప్పులలో కూరుకుపోవడానికి తెరాస సర్కార్ కారణం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో మొదలైన రైతుల ఆత్మహత్యలు నేటికీ ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, తెరాసలు రెండూ నాణేనికి బొమ్మాబొరుసు వంటివని వాటిలో ఏది అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని కనుక వాటికి ప్రత్యామ్నాయంగా  వామపక్ష, అంబేద్కర్ సిద్దాంతాల కలయికతో ముందుకు వచ్చిన బిఎల్ఎఫ్ మాత్రమే ప్రజలందరికీ న్యాయం చేయగలదని సూర్యప్రకాష్ అన్నారు. 

అధికారంలో లేని ప్రతిపక్షపార్టీలు, కొత్తగా ఏర్పాటుచేసిన పార్టీలు ఎన్ని సవాళ్లైనా చేయవచ్చు. ఎందుకంటే అది కొండను వెంట్రుకతో మూడేసి లాగే చిన్న ప్రయత్నమే. నిజానికి వాటివద్ద అధికార పార్టీని డ్డీకొనగల బలమైన అభ్యర్ధులు ఉండరు. దొరకరు కూడా. అటువంటివారి కోసం వెతుక్కోవలసి ఉంటుంది. కనుక ఏ వర్గానికి ఎన్ని సీట్లైనా కేటాయించగలవు. కానీ అధికారపార్టీకి అవసరానికి మించిన అభ్యర్ధులుంటారు. ఎందుకంటే, టికెట్ లభిస్తే 50 శాతం గెలిచేసినట్లే. కనుక వారిలో నుంచి చాలా జాగ్రత్తగా గెలుపు గుర్రాలను గుర్తించి ఎంచుకోవలసి ఉంటుంది. అయినా చిన్న చిన్న పదవుల పంపకాలకే అనేక కూడికలు, తీసివేతలు ఉంటాయి. ఇక ఎన్నికలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ తెలుసు. కాంగ్రెస్, తెరాసలకు ఇటువంటి సవాలు విసిరే ముందు బిఎల్ఎఫ్ నేతలు తమ వద్ద 119 మంది అభ్యర్ధులున్నారో లేదో చూసుకొంటే మంచిదేమో కదా? 


Related Post