టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇటీవల అమెరికాలో పర్యటించి వచ్చిన తరువాత శుక్రవారం సోమాజీగూడలో మీడియాతో మాట్లాడుతూ, “అమెరికాలో స్థిరపడిన తెలంగాణావాసులను కలిసినప్పుడు వారు రాష్ట్రంలో పరిస్థితుల గురించి అడిగితెలుసుకొన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదు కనుక వాటిని నెరవేర్చేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మేము స్థాపించబోతున్న పార్టీ నూతన ఆలోచనలు, విధానాలతో ఒక కొత్త ఒరవడితో ఏర్పాటు చేయాలని వారు కోరారు. అందుకు అనుగుణంగానే పార్టీ నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయి. ఇతర పార్టీలకు చెందిన కొన్ని పెద్ద తలకాయలు మాతో టచ్చులో ఉన్నారు. సరైన సమయంలో వారు బయటకు వస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతున్నా తెరాస సర్కార్ పట్టించుకోవడం లేదు. అందుకే పెద్ద ఎత్తున పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించాము. ‘ఉద్యోగాలు ఇచ్చుడో కెసిఆర్ సచ్చుడో..’ అని నిరుద్యోగులు తమ ఆగ్రహాన్ని, నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని మేము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే అంతవరకు కనీసం నిరుద్యోగ భ్రుతి అయినా ఇవ్వాలి. ప్రైవేట్ సంస్థలలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి,” అని అన్నారు.
వర్తమాన రాజకీయాలలో ఫిరాయింపులు సాధారణమైన విషయంగానే పరిగణింపబడుతున్నప్పటికీ, ‘నూతన ఒరవడి’ నూతన ఒరవడితో పార్టీని ఏర్పాటు చేస్తున్నామంటూ మళ్ళీ ఇతర రాజకీయ పార్టీల నేతలు తమతో టచ్చులో ఉన్నారని కోదండరాం చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే పార్టీ ఇంకా స్థాపించక ముందే ఫిరాయింపులకు సిద్దపడుతున్నారన్న మాట!
ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో చేరకుండా వేరే కుంపటి పెట్టుకోవడం అంటే ఏవో కారణాల చేత ఆ పార్టీతో విభేదిస్తున్నట్లే. కాదంటే ఆ పార్టీతో రహస్య అవగాహన ఉందనుకోవలసి ఉంటుంది. అయన తెరాస పాలన తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దాని విధానాలతో విభేదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. కనుక మళ్ళీ ఆ రెండు పార్టీల నుంచే నాయకులను తెచ్చుకొంటే ఇక అయన వారితో ఏమి సాధించగలరు? ఇంతకీ ఆయనతో టచ్చులో ఉన్న పెద్ద తలకాయలు ఎవరో?