తెదేపాను తెరాసలో విలీనం చేయమన్నందుకు పార్టీ నేతల ఆగ్రహానికి గురైన మోత్కుపల్లి నరసింహులు శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు తెలంగాణా రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి చూసి నాకు చాలా బాధ కలిగి, రాష్ట్రంలో గల 10 లక్షల మంది తెదేపా కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే నేను తెదేపాను తెరాసలో విలీనం చేయాలని చెప్పాను. కానీ నా మాటలు వారి మనసు నొప్పించాయని తెలిసి క్షమాపణ చెపుతున్నాను. తెరాసలో తెదేపా విలీనం చేయబోమని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు కానీ పొత్తులు ఉంటాయని చెప్పారు. తెరాసతో పొత్తులు పెట్టుకోవాలనే నేను చెపుతున్నాను. దానిలో తప్పేమీ లేదు. ఎందుకంటే తెరాసలో ఉన్న నేతలలో కెసిఆర్ తో సహా చాలా మంది తెదేపా నుంచి వెళ్ళినవారే. వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకోవడం చాలా అవసరం,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, “అయన ఓటుకు నోటుకేసుతో పార్టీ పరువు తెసేశారు. అప్పుడే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండి ఉంటే నేడు పార్టీకి ఈ దుస్థితి పట్టేది కాదు. రేవంత్ రెడ్డి పార్టీని వాడుకొని గుర్తింపు సంపాదించుకొన్నాక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అతనొక ద్రోహి. అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోతేనే మంచిది,” అని అన్నారు.
మోత్కుపల్లి మాటలను బట్టి నేటికీ ఆయన తెరాస వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం అవుతోంది. అదే విషయం తెరాసకు తెలియజేసేందుకే ఈవిధంగా మాట్లాడుతున్నట్లు చెప్పవచ్చు.
ఇక చంద్రబాబు నాయుడు కోసం చాలా త్యాగాలు చేశానని చెపుతూనే, రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడం, బాబుకు చాలా ఇబ్బందికరమైన ఓటుకు నోటు కేసు ప్రస్తావన చేయడం కూడా తెరాస అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికేనని చెప్పవచ్చు. కనుక తెరాస నుంచి ఆఫర్ వస్తే మరుక్షణం ఆ పార్టీలోకి దూకేయడం ఖాయంగానే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుకు మోత్కుపల్లి మాటలు అర్ధం కావనుకొంటే అవివేకమే. అందుకే మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి మోత్కుపల్లి నరసింహులును ఆహ్వానించలేదని భావించవచ్చు. కనుక మోత్కుపల్లి ఇక తెదేపా గురించి మాట్లాడే బదులు తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించుకొంటే మంచిదేమో?