టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెదేపాను తెరాసలో విలీనం చేయాలనీ చెప్పడం పొరపాటే. అందుకు నేను పార్టీని క్షమాపణ కోరుతున్నాను. చాలా కీలక సమయాలలో నేను పార్టీకి, మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డాను. ఆ కారణంగా నాపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అయినా నేను పార్టీని, బాబును వీడలేదు. ఆ సంగతి అందరికీ తెలుసు. నిన్న నేను లేకుండానే టిటిడిపి పోలిట్ బ్యూరో సమావేశం జరపడం నాకు చాలా బాధేసింది. మా పార్టీ నేత ఒంటరు ప్రతాప్ రెడ్డిని తెరాస సర్కార్ జైల్లో పెడితే మాపార్టీలో అడిగే నాధుడే లేడు,” అని అన్నారు.
తెదేపాను తెరాసలో విలీనం చేయాలనేది మోత్కుపల్లి అభిప్రాయం. అయన మనసులో ఉన్న ఆలోచన. కనుక అదే చెప్పారు. పోలిట్ బ్యూరో సభ్యుడైన తనను ఆహ్వానించకుండా పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించడంతో మోత్కుపల్లి కంగుతిన్నట్లున్నారు. బహుశః అందుకే క్షమాపణలు చెప్పి ఉండవచ్చు. అంతమాత్రన్న అయన అభిప్రాయం మారిపోతుందని అనుకోవడం అవివేకమే అవుతుంది. ఒకవేళ తెదేపాకు దూరం అయితే అయన వేరే పార్టీలోకి వెళ్ళడం కష్టమే. రాష్ట్రంలో ఒక్క భాజపా తప్ప కాంగ్రెస్, తెరాసలు ‘హౌస్ ఫుల్’ అయ్యున్నాయి. కనుక వేరే పార్టీ నుంచి ఆహ్వానం వచ్చేవరకు తెదేపాలో కొనసాగడమే సరైన నిర్ణయం. బహుశః అందుకే మోత్కుపల్లి నరసింహులు వెనక్కు తగ్గినట్లున్నారు. అయితే అప్పుడేదో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాలనే తాపత్రయంతో తెదేపాను తెరాసలో విలీనం చేయాలని తన మనసులో మాట బయటకు చెప్పేసి పార్టీలో వ్యతిరేకత మూట గట్టుకొన్న తరువాత ఇప్పుడు క్షమాపణలు చెప్పి ఏమి ప్రయోజనం?