కెసిఆర్, కేటిఆర్ లను జైలుకు పంపుతాం: కోమటిరెడ్డి

March 02, 2018


img

రాజకీయ నేతలు పొరపాటునో లేదా ఆవేశంతోనో మాట్లాడితే తరువాత ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుందో తెలియజేసే అనేక ఉదాహరణలు చూశాము. ఆవిధంగా ఆవేశంగా మాట్లాడేవారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకరని చెప్పక తప్పదు. కాంగ్రెస్ నేతల బస్సు యాత్రపై కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి తీవ్ర ఆవేశంగా స్పందించారు. 

మిర్యాలగూడ పట్టణంలో పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, “మేము అధికారంలోకి వస్తే కెసిఆర్, కేటిఆర్ ఇద్దరినీ జైలుకు పంపిస్తాం. ప్రాజెక్టులలో తండ్రీకొడుకులు ఇద్దరూ వేల కోట్లు కమీషన్లు దండుకొంటున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును నలుగురు ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దానిలో రూ.500 కోట్లతో  ఆప్టికల్ కేబుల్ కాంట్రాక్ట్ ను రూ. 5,000 కోట్లకు తన బామర్ధికి కట్టబెట్టారు. ఇంకా మియాపూర్, జీడిమెట్ల వంటి బారీ కుంభకోణాలు జరిగాయి. వాటన్నిటినీ ఆధారాలతో సహా అసెంబ్లీలో తెరాస సర్కార్ ను నిలదీస్తాము.  మేము అధికారంలోకి రాగానే తండ్రీకొడుకులు అక్రమంగా పోగేసుకొన్న ఆస్తులను వెలికితీసి న్యాయస్థానం ముందు నిలబెడతాము. కేటిఆర్ తన స్థాయిని మించి తన కంటే వయసులో, రాజకీయ అనుభవంలో పెద్దవారిన మా కాంగ్రెస్ నేతలను తిడితే తన స్థాయి, తన పార్టీ గౌరవం పెరుగుతుందని భావిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తన శాఖలపై కనీస అవగాహన లేని ఆయనా మా నాయకులను విమర్శించేది. అయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను,” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

కేటిఆర్ తన స్థాయిని మించి తన కంటే పెద్దవారైన కాంగ్రెస్ నేతలను తిడుతున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసిఆర్ ను, నాలుగు శాఖలకు ఒంటి చేత్తో నిర్వహిస్తూ అందరి చేత ప్రశంశలు అందుకొంటున్న మంత్రి కేటిఆర్ ను ఉద్దేశ్యించి ఈవిధంగా అనుచితంగా మాట్లాడటం కూడా తప్పే.  

ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటిని నిరూపించవలసిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. ఒకవేళ కెసిఆర్, కేటిఆర్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నమ్ముతున్నట్లయితే, అయన వద్ద బలమైన ఆధారాలున్నట్లయితే, అయన అయన మీడియాకు చెప్పడం కంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే బాగుండేది. ఎవరైనా ఆరోపణలు చేస్తే వాటిని నిరూపించాలని లేకుంటే తామే వారిని కోర్టుకీడుస్తామని కెసిఆర్ గతంలో ఓసారి హెచ్చరించారు కూడా. కనుక ఇప్పుడు బంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులోనే ఉందని చెప్పవచ్చు. 


Related Post