పొత్తులుంటాయి...ఎవరితో..తెలియదు: బాబు

March 02, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కూడా తెదేపా చాలా బలంగా ఉండేది. కానీ ఆ తరువాత అందరికీ తెలిసిన కారణాల చేత పూర్తిగా బలహీనపడింది. రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన తరువాత పార్టీ ఉనికిని చాటే నాయకుడే కరువయ్యాడు. ఈ పరిస్థితులలో తెదేపా ఉండగా సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కనుక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్న తెలంగాణాలో పార్టీ పరిస్థితిపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిటిడిపి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఆ సందర్భంగా పొత్తుల ప్రస్తావన వచ్చినప్పుడు, “తెలంగాణాలో మనతో పొత్తులు పెట్టుకొన్న భాజపా మిత్రధర్మం పాటించకుండా మనకు దూరమయింది. కనుక వేరే పార్టీతో తప్పకుండా పొత్తులు పెట్టుకోవాలి. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరితో పొత్తులు పెట్టుకొవాలో నిర్ణయించుకొందాము. మన పార్టీని తెరాసలో విలీనం చేసే ప్రశ్నే లేదు. కొంతమంది నేతలు పార్టీని వీడిపోయినప్పటికీ తెలంగాణాలో మనకు బలమైన క్యాడర్ ఉంది. ప్రజలలో మనకు ఆదరణ చెక్కుచెదరలేదు. ఇకపై పార్టీ నేతలందరూ ప్రజలలోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉంది,” అని అన్నారు.

చంద్రబాబు మాటలను బట్టి తెలంగాణాలో తెదేపా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో భాజపా తనంతట తానే తెదేపాకు దూరం అయ్యింది కనుక కాంగ్రెస్, తెరాస లేదా బి.ఎల్.ఎఫ్.కూటమిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవలసి ఉంటుంది. 

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ దానితో పొత్తులు పెట్టుకొంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. తెరాస అంగీకరిస్తే పొత్తులు పెట్టుకోవచ్చు. కానీ ఎవరితో పొత్తులు లేకుండానే తెరాస 106 సీట్లు గెలుచుకోగదని ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టిగా చెపుతున్నప్పుడు తెదేపాతో పొత్తులు పెట్టుకోవలసిన అవసరం లేదు. కనుక బి.ఎల్.ఎఫ్.కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకుంటే ఒంటరి పోరాటానికి సిద్దపడాల్సి ఉంటుంది కానీ తెదేపాకు ఇప్పుడు అంత శక్తి లేదు కనుక పొత్తులు అనివార్యమే. అదే చంద్రబాబు చెప్పారు. పొత్తులు ఖాయమే కానీ ఎవరితో అనేది తెలియాల్సి ఉంది.     



Related Post