రాష్ట్రంలో చిన్నాపెద్దా, పేద ధనిక రైతులందరికీ ఎకరాకు రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8,000 పంట పెట్టుబడి అందించడానికి సిద్దపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కౌలురైతులకు మాత్రం ఈ పధకాన్ని వర్తింప జేయడంలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఈ విషయం దృవీకరించారు.
తెలంగాణా రైతు సమన్వయ సమితి అవగాహన సమావేశాలలో అయన మాట్లాడుతూ, “కౌలు అనేది రైతుకు-కౌలు రైతుకు మద్య జరిగే ఒక ప్రైవేట్ వ్యవహారం. కనుక కౌలు రైతులకు దీనిని వర్తింపజేయడం వలన అనేక సమస్యలు వస్తాయి. కౌలు రైతులకు ఈ పధకాన్ని వర్తింపజేస్తే స్వంతభూమి కలిగి వ్యవసాయం చేస్తున్న రైతులకు అన్యాయం జరుగుతుంది. పైగా కౌలు అనేది కొంతకాలానికి మాత్రమే పరిమితమైన తాత్కాలిక ఒప్పందం. కనుక కౌలు రైతుకు ఈ పధకాన్ని వర్తింపజేయడంలేదు. అయితే స్వంత భూమి కలిగి వ్యవసాయం చేస్తున్న రైతులకు పంటపెట్టుబడి అందిస్తున్నాము కనుక కౌలు రైతులకు ఎంత ఇచ్చుకొంటారనేది వారే నిర్ణయించుకొంటారు. ఈ పధకం ప్రధానోద్దేశ్యం స్వంతభూమి కలిగి వ్యవసాయం చేస్తున్న రైతులకు సహాయపడి వారు నిలద్రొక్కుకొనేలా చేయడమే కనుక దీనిని కౌలు రైతులకు వర్తింపజేయడం లేదు,” అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినదానిని బట్టి బక్కచిక్కిన కౌలురైతులకు ఈ ప్రయోజనం అందకపోయినా అయనతో సహా 60-70 ఎకరాలున్న తెలంగాణా రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి రాజకీయ నేతలు కూడా ఈ పధకంలో లబ్దిపొందుతారని స్పష్టం అయ్యింది. ముఖ్యమంత్రి చెప్పిన లెక్క ప్రకారమే గుత్తాకు 70ఎకరాలు పొలం ఉన్ధనుకొంటే, ఎకరాకు 8,000 చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి 70X8,000=5,60, 000 అయన అందుకోబోతున్నారని స్పష్టం అవుతోంది.
ఈ పధకం ద్వారా తనకు లభించబోయే సొమ్మును వదులుకొంటానని, మోతుబారి రైతులు కూడా వదులుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఆవిధంగా మిగిలిన సొమ్మును కూడా మళ్ళీ తెలంగాణా రైతు సమన్వయ సమితి ఖాతాలోనే జమా చేద్దామని అన్నారు.
అయితే అప్పనంగా లక్షల రూపాయలు వస్తుంటే ఎవరు వద్దంటారు? ఎవరు వదులుకొంటారు? కౌలు రైతుల విషయంలో అంత దూరదృష్టితో ఆలోచించిన ముఖ్యమంత్రి కెసిఆర్, ధనిక, మోతుబారి రైతుల విషయంలో ఎందుకు ఇంత ఉదారంగా వ్యవహరిస్తున్నారు? ఈ పధకానికి కౌలు రైతులు అనర్హులని ముందే తేల్చి చెప్పినట్లుగానే, ధనిక రైతులకు కూడా దీనిని వర్తింపజేయకుండా ముందే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండటం వంటి పరిమితులు, విధివిధానాలు నిర్ణయిస్తే సరిపోతుంది కదా? ఈ పధకం ప్రదానోదేశ్యం కేవలం ఆర్ధికసమస్యలలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద రైతులను ఆదుకోవడానికేనని చెపుతున్నప్పుడు తన వంటి ధనవంతులైన రైతులకు కూడా దానిని ఎందుకు వర్తింపజేస్తున్నట్లు? మళ్ళీ‘గివ్ ఇట్ అప్' అంటూ ఆ సొమ్మును స్వచ్చందంగా వదులుకోవాలని బ్రతిమాలుకోవడం ఎందుకో అర్ధం కాదు.