ప్రముఖనటి శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్ లో చనిపోయారని మొదట వార్తలు వచ్చినప్పటికీ, ఆమె బాత్రూంలో ప్రమాదవశాత్తు బాత్-టబ్ లో పడి నీళ్ళలో మునిగిపోవడం వలన చనిపోయారని పోస్ట్ మార్టంలో తేలింది. ఆ సమయంలో ఆమె స్పృహ కోల్పోయినట్లు నివేదికలో పేర్కొనడంతో జాతీయ అంతర్జాతీయ మీడియాలో శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రకరకాల కధనాలు వెలువడ్డాయి. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత దుబాయ్ పోలీసులు ఈ కేసును తదుపరి విచారణ కొరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందినట్లు భావిస్తున్న కారణంగా ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేయవలసి ఉందని కనుక శ్రీదేవి భౌతికకాయాన్ని ఈరోజు అప్పగించలేమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయవాది తేల్చి చెప్పడంతో, రేపు సాయంత్రంలోగా ఆమె భౌతికకాయాన్ని ముంబై తీసుకురావడానికి ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రీదేవి మృతి చెందిన తరువాత దుబాయ్ పోలీసులు ఆమె భర్త బోనీకపూర్ ను సుమారు మూడు గంటలసేపు ప్రశ్నించారు. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే..శ్రీదేవి బాత్ టబ్ లో పడి నీళ్ళలో మునిగి చనిపోతే, ఆమె గుండెపోటుతో చనిపోయారని ఎందుకు చెప్పారు? అని. ఏమైనప్పటికీ, యావత్ భారతదేశ ప్రజల మనసు దోచుకొన్న అటువంటి అపూర్వమైన నటి జీవితానికి దేశం కాని దేశంలో ఇటువంటి విషాదకరమైన ముగింపు రావడం...అది కూడా చాలా మిస్టరీగా మారడం చాలా బాధాకరమే.