పేరుకే అవి శిక్షణా తరగతులు..

February 26, 2018


img

రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక సమయంలో కార్యకర్తలకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటాయి. శిక్షణా తరగతులు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశ్యం మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన కార్యకర్తలకు తగిన రాజకీయ శిక్షణ ఇచ్చి, వారిని పార్టీతో...పార్టీ కార్యక్రమాలతో మమేకం చేయడం. తద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీలను బలోపేతం చేసుకోవడం. వీలైతే వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేసి ద్వితీయ శ్రేణి నాయకులను తయారుచేసుకోవడం. కానీ మన రాజకీయ పార్టీలు అటువంటి ప్రయత్నాలు చేయకుండా స్వోత్కర్ష (స్వంత డబ్బా), పరనింద (ప్రత్యర్ధి పార్టీని తిట్టిపోయడం) చేయడమే శిక్షణా తరగతులు అని భావిస్తుంటాయి. 

ఈరోజు టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తమ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణా తరగతులు కూడా ఈవిధంగానే సాగాయని అయన మాటలను బట్టి అర్ధమవుతోంది. 

“పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్న తెరాసకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. ఒకపక్క తెలంగాణా ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకొంటూనే, మరోపక్క వేలకోట్లు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. పార్టీలో ఎంతమంది నేతలు బయటకు వెళ్ళిపోయినా, కార్యకర్తలందరూ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నందున తెదేపా చెక్కుచెదరలేదు. కార్యకర్తలందరూ ప్రజలలోకి వెళ్ళి తెరాస సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించి, వచ్చే ఎన్నికలలో తెదేపా గెలుపుకు కృషి చేయాలని,” ఎల్ రమణ కోరారు. 

రేవంత్ రెడ్డి తెదేపా విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన తరువాత టిటిడిపిలో ఏ ఒక్క నేత ముందుకు వచ్చి పార్టీని బ్రతికించుకొనేందుకు గట్టిగా కృషి చేసినట్లు కనబడదు. పార్టీ నేతలు పార్టీ కార్యాలయాలకు, ఏసీ రూములకు, వారివారి వ్యాపారాలకు పరిమితమవుతూ, కార్యకర్తలను మాత్రం ప్రజలలోకి వెళ్ళి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పడం విచిత్రమే కదా? 


Related Post