“ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మోడీ సర్కార్ పై సింహంలా గర్జిస్తుంటారు. అదే డిల్లీ వెళ్ళినప్పుడు వినయవిధేయతలతో వ్యవహరిస్తుంటారు,” అని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కొన్ని రోజుల క్రితం అన్నారు. నిన్న, ఇవ్వాళ్ళ తెలంగాణా రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులలో ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంపై విమర్శలు చూస్తే షబ్బీర్ అలీ చెప్పిన మాటలు నిజమేననిపిస్తుంది.
రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయంలో తెలంగాణా రైతు సమన్వయ సమితి సభ్యులను ఉద్దేశ్యించి ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడినప్పుడు కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇవ్వాళ్ళ కరీంనగర్ సమావేశంలో కూడా మళ్ళీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎక్కువ కాలం కాంగ్రెస్, భాజపాలే దేశాన్ని పాలించాయని, కానీ వాటి తెలివితక్కువతనం వల్లనే నేటికీ దేశంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. దేశాన్ని పాలించిన ఆ రెండు పార్టీల నేతలు ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలంటూ రోడ్లెక్కి ధర్నాలు చేస్తుండటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మార్చి 5నుంచి మళ్ళీ మొదలవబోతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెరాస ఎంపిలు కేంద్రాన్ని రైతు సమస్యలపై గట్టిగా నిలదీయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు.
వారం రోజుల క్రితం పంటి ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ డిల్లీ వెళ్ళినప్పుడు, ప్రధాని మోడీ విదేశాల నుంచి తిరిగి వచ్చేవరకు ఎదురుచూసి, అయనను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడారు. ఆ తరువాత పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఈరోజు అదే మోడీ సర్కార్ తెలివి తక్కువదని విమర్శిస్తున్నారు.
నేటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రకు బయలుదేరి తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించబోతున్నారు కనుక తెరాస మంత్రులు, నేతలు వారిపై ఎదురుదాడి చేసి తమ ప్రభుత్వంపై ఈగ వాలకుండా కాపాడుకోవాలనుకోవడం సహజమే. కానీ ఒకపక్క కేంద్రంతో వినయవిధేయతలతో వ్యవహరిస్తూ, దాని పొగడ్తలను స్వీకరిస్తూ మళ్ళీ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈవిధంగా దానిపై విమర్శలు గుప్పిస్తుండటం విచిత్రంగానే ఉంది. భాజపా కూడా తెరాస పట్ల ఇదేవిధంగా వ్యవహరిస్తుండటం అందరూ గమనించే ఉంటారు. కేంద్రం పట్ల తెరాస వైఖరి, తెరాస పట్ల కేంద్రం వైఖరి ఇంచుమించు ఒకేలాగ ఉండటం చాలా ఆసక్తికరంగా ఉంది. దీని భావమేమిటో..ఎన్నికలు దగ్గర పడితే కానీ తెలియదు.