బి.ఎల్.ఎఫ్. ప్రభావం చూపగలదా?

February 26, 2018


img

సిపిఎం నేతృత్వంలో ఏర్పాటయిన బహుజన వామపక్ష ఫ్రంట్ (బిల్ఎఫ్) కూటమి వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 119స్థానాలకు పోటీ చేస్తానని గట్టిగా చెపుతోంది. చెప్పడమే కాకుండా రాష్ట్రంలో తన ఉనికిని చాటుకొని ప్రజలను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు కూడా చేస్తోంది. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిన్న బారీ బహిరంగ సభ నిర్వహించింది. తెరాస సర్కార్ అగ్రకుల ఆధిపత్యం, పెత్తందారి వ్యవస్థ కొనసాగుతోందని బిల్ఎఫ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడానికి భూమి లేదని చెపుతున్న తెరాస సర్కార్, కార్పోరేట్ కంపెనీలకు వందల ఎకరాలను ఉదారంగా దానం చేస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం అమలుచేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస మంత్రుల మాటలకు చేతలకు మద్య తేడాకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని బిల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ విమర్శించారు. 

వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు బిల్ఎఫ్ కు ఓటేసి గెలిపిస్తే, రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి చూపిస్తామని, కార్పోరేట్ కబంధ హస్తాలలో చిక్కుకుపోయున్న విద్య, వైద్యరంగాలను సర్కార్ అధీనంలోకి తీసుకువచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తామని బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు.  వచ్చే ఎన్నికలలో మొత్తం 119 స్థానాలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 

బిఎల్ఎఫ్, ప్రొఫెసర్ కోదండరాం స్థాపించబోతున్న తెలంగాణా జనసమితి (టిజెఎస్)లు ఎన్ని స్థానాలకైనా పోటీ చేయవచ్చు. కానీ తెరాస ప్రభావంలో ఉన్న ప్రజలను ఆకర్షించి వారి ఓట్లు సంపాదించుకోగలవా? అంటే అనుమానమే. తెరాస సర్కార్ నియంతృత్వ పోకడలు పోతున్న మాట నిజమే. అయితే దానివలన తెరాస రాజకీయ ప్రత్యర్దులే తప్ప సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవడం లేదు కనుక తెరాస సర్కార్ నియంతృత్వ పోకడల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వారు పట్టించుకోకపోవచ్చు. 

ఇక తెరాస సర్కార్ ఒకే సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, ఎప్పటికప్పుడు అనేక సరికొత్త సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రజలతో సహా  అందరి ప్రశంశలు అందుకొంటోంది. పైగా రాజకీయంగా కూడా తన ప్రత్యర్ధులపై పైచెయ్యి సాధించగలిగింది. ఇక దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉందిప్పుడు. 

ఈ పరిస్థితులలో టిజెఎస్, బిఎల్ఎఫ్ లు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొని విజయం సాధించడం కష్టమే. కానీ అవి తప్పకుండా ఓట్లు చీల్చి తెరాసకు ఎంతో కొంత నష్టం కలిగించడం ఖాయమని చెప్పవచ్చు. 


Related Post