ఇంతకాలం కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన మానవరహిత యుద్దవిమానాన్ని తొలిసారిగా భారత్ కూడా తయారుచేసి, ఆదివారంనాడు విజయవంతంగా పరీక్షించింది. రుస్తుం-2 అనే పేరుగల ఈ మానవ రహిత యుద్దవిమానాన్ని ఆదివారం కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలో చలకేరే అనే ప్రాంతంలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటిఆర్) లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.వో.) ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్షించి చూసిన తరువాత ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని డి.ఆర్.డి.వో. చైర్మన్ ఎస్. క్రిష్టోఫర్ మీడియాకు తెలిపారు. రూ.1500 కోట్ల ఈ బారీ ప్రాజెక్టులో డి.ఆర్.డి.వో., హిందూస్తాన్ ఏరోనాటికల్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు కలిసి పనిచేసి దీనిని తయారుచేశాయి.
దీని ప్రత్యేకతలు: దీనిలో అత్యాధునిక కెమెరాలను, సాంకేతికత పరికరాలను అమర్చారు. ఇది ఏకధాటిగా 24-30 గంటలసేపు గాలిలో ఎగురగలదు. సాధారణ విమానాల మాదిరిగానే రన్-వై లపై నుంచి ఎగురుతుంది. దిగుతుంది. దీనిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా నియంత్రించవచ్చు. ఇది 35,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ శత్రుస్థావరాల ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి చూపగలదు. శత్రుస్థావరాలను, శత్రువుల కదలికలను ఇది గుర్తించగలదు కానీ దాడి చేయలేదు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది కనుక తరువాత దశలో ఆ సామర్ధ్యం కూడా దీనికి కల్పించవచ్చు. మరికొన్ని సార్లు ప్రయోగాలు నిర్వహించిన తరువాత భారత ఆర్మీ, నేవీ, వాయుసేనలకు అవసరాలను బట్టి ఉత్పత్తి చేసి అందించబడతాయి.